Let's talk: editor@tmv.in
‘సేవా తీర్థ్’ ప్రారంభం ఆధునిక పరిపాలనకు నూతన దిశ: చంద్రబాబు

‘సేవా తీర్థ్’ ప్రారంభం ఆధునిక పరిపాలనకు నూతన దిశ: చంద్రబాబు

Panthagani Anusha
15 ఫిబ్రవరి, 2026

భారత పరిపాలనా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, దేశ రాజధానిలో అత్యున్నత వసతులతో నిర్మించిన నూతన ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) భవన సముదాయం 'సేవా తీర్థ్'ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. దాదాపు 95 ఏళ్ల పాటు బ్రిటీష్ కాలం నాటి 'సౌత్ బ్లాక్' వేదికగా సాగిన అత్యున్నత పాలన ఇకపై ఈ అధునాతన ప్రాంగణం నుంచి కొనసాగనుంది.

అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఈ చారిత్రాత్మక ఘట్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ"సేవా తీర్థ్ ప్రారంభోత్సవం భారత పరిపాలనా చరిత్రలో ఒక కీలక మైలురాయి. వలస పాలన ఆనవాళ్లకు వీడ్కోలు పలికే దిశగా ఇది ఒక నిర్ణయాత్మక అడుగు. ప్రజాకేంద్రిత పాలనను అందించాలనే ప్రధాని మోదీ గారి సంకల్పానికి ఇది నిదర్శనం. ఇది 'వికసిత భారత్ 2047' లక్ష్యానికి అనుగుణంగా ఉంది అని కొనియాడారు.

అత్యాధునిక వసతులు.. ఏకీకృత పాలన

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ 'సేవా తీర్థ్' సముదాయంలో కేవలం పీఎంఓ మాత్రమే కాకుండా, దేశ భద్రతలో కీలకమైన జాతీయ భద్రతా మండలి,కేబినెట్ కార్యదర్శిత్వం విభాగాలను ఒకే చోట చేర్చారు. దీనివల్ల వివిధ శాఖల మధ్య సమన్వయం పెరిగి నిర్ణయాధికారం వేగవంతం కానుంది. ఇదిలా ఉండగా చాళుక్యుల నిర్మాణ శైలి, బౌద్ధ స్తూపాల ప్రేరణతో రూపుదిద్దుకున్న ఈ భవనం పర్యావరణ హితంగా నిర్మించడం జరిగింది. అంతర్జాతీయ సదస్సుల కోసం ఇందులో 'ఇండియా హౌస్' అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

పేరులోనే 'సేవ' సందేశం

పాలన అంటే అధికారం చలాయించడం కాదు ప్రజలకు సేవ చేయడమేనన్న ఉద్దేశంతో ఈ భవనానికి 'సేవా తీర్థ్' అని నామకరణం చేశారు. ఈ మార్పుల్లో భాగంగానే కేంద్ర కార్యదర్శిత్వ భవనాలకు 'కర్తవ్య భవన్' అని రాజ్‌పథ్‌కు 'కర్తవ్య పథ్' అని గతంలోనే పేర్లు మార్చిన సంగతి తెలిసిందే.