
సేఫ్ రైడ్ చాలెంజ్‌ను ప్రారంభించిన హైదరాబాద్ సీపీ
హైదరాబాద్ కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ పోలిసింగ్‌లో తన మార్క్‌ను చూపిస్తున్నారు. జనాల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో సీపీ సజ్జనార్ సేఫ్‌రైడ్ ఛాలెంజ్ అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు సేవలందించిన వీసీ సజ్జనార్ ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. వచ్చిరాగానే పోలిసింగ్ విధానంలో ఆయన తన మార్క్‌ను చూపిస్తున్నారు.
ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపుడుతున్నారు. ఇందులో భాగంగానే వాహనదారుల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో సేఫ్‌రైడ్ ఛాలెంజ్ అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులు ప్రయాణం స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ కట్టుకోవడం వంటి భద్రతా చర్యలను పాటిస్తూ ఒక చిన్న వీడియో లేదా ఫోటో తీసి, తన ముగ్గురు స్నేహితులను, కుటుంబ సభ్యులను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పుకొచ్చారు.
ఇలా చేయడం ద్వారా అతిగా సోషల్ మీడియా ఉపయోగించే యువతలో మార్పు తీసుకురావచ్చని వారికి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన తేవొచ్చని తెలిపారు. సేఫ్టీ ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాదు..మీ ప్రతి ప్రయాణం మిమ్మల్ని, మీకు ఇష్టమైన వారిని రక్షించుకునే నిర్ణయంతో మొదలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనాలని మనం అందరం కలిసి సేఫ్టీని 2025లో కూలెస్ట్ ట్రెండ్‌గా మార్చుదాం అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రాణాలు పోతున్నాయ్
హెల్మెట్, సీటు బెల్టులు ధరించక వేలాది మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డుప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు వాడకపోవడం ప్రాణాంతకంగా మారుతోంది. తెలంగాణలో 2024 సంవత్సరంలోనే హెల్మెట్ లేకపోవడంతో 3,137 మంది, సీటు బెల్టు వినియోగించకపోవడంతో 482 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అంటే ఈ రెండు ఉల్లంఘనల కారణంగా మొత్తం 3,600 మందికిపైగా మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధుల్లో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతుండగా, రాచకొండ కమిషనరేట్‌లో ఈ ఏడాది జూన్ వరకు 1,822 ప్రమాదాలు, వాటిలో 363 మరణాలు నమోదు అయ్యాయి. రెండు చక్రాల వాహన ప్రమాదాల్లో మరణించిన వారిలో 80 శాతం మందికి హెల్మెట్ లేదని అధికారులు గుర్తించారు.
ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు
హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి తక్షణమే చలాన్లు విధిస్తూ, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని హెచ్చరిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు, రోడ్లపై గుర్తుల ఏర్పాట్లు, డ్రోన్ మానిటరింగ్, స్పీడ్ గన్ పరికరాలు వంటి సాంకేతిక పద్ధతులను అమల్లోకి తెస్తున్నారు. రోడ్డు భద్రతపై సుప్రీం కోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్ష కూడా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలు తగ్గించేందుకు ‘బ్లాక్ స్పాట్స్’ గుర్తింపు, రోడ్ల నవీకరణ, అవగాహన ప్రచారాలపై దృష్టి పెట్టాలని సూచించింది.
