Let's talk: editor@tmv.in
సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో మోసాలు..

సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో మోసాలు..

Sirisha B
20 ఫిబ్రవరి, 2026

ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లలో వెతకడం మనకు అలవాటు. అయితే, ఈ అలవాటే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. సెర్చ్ ఇంజిన్లలో టాప్‌లో కనిపించే వెబ్‌సైట్లు లేదా 'స్పాన్సర్డ్' అని ఉన్న లింకులు అన్నీ సురక్షితమైనవి కావని, కేవలం సెర్చ్ ఫలితాల్లో పైన కనిపించినంత మాత్రాన అది అసలైన వెబ్‌సైట్ అని గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోయే ప్రమాదం వుందని ఐపీఎస్‌ అధికారి వి.సీ. సజ్జనర్‌ హెచ్చరించారు. చిన్న సమాచారం కోసం గూగుల్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్‌లపై ఆధారపడే అలవాటును సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని తెలిపారు.

సైబర్ ముఠాలు అత్యాధునిక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, పద్ధతులు, పెయిడ్ యాడ్స్‌ను ఉపయోగిస్తూ ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో అచ్చం అసలైనట్లే కనిపించే నకిలీ వెబ్‌సైట్లను రూపొందిస్తున్నాయని పేర్కొన్నారు. ఇవి సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానంలో కనిపించేలా ప్లాన్ చేస్తున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా కస్టమర్ కేర్ నంబర్లు లేదా పేమెంట్ సేవల కోసం వెతికే వినియోగదారులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఈ నకిలీ వెబ్‌సైట్లలోకి వెళ్లగానే లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ సమాచారం నమోదు చేయాలని అడుగుతారని, ఒక్కసారి ఆ వివరాలు ఇచ్చారంటే క్షణాల్లో ఖాతాలు ఖాళీ కావడం ఖాయమని హెచ్చరించారు. ఆర్థిక నష్టంతో పాటు మీ పేరిట ఉన్న డాక్యుమెంట్లను దొంగిలించి 'ఐడెంటిటీ థెఫ్ట్'కు పాల్పడే అవకాశం కూడా ఉందన్నారు.

జాగ్రత్తలివే..

• వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ను తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించాలి. చిరునామాలో చిన్న స్పెల్లింగ్‌ తేడా కనిపించినా అది నకిలీ వెబ్‌సైట్‌ కావచ్చని అప్రమత్తంగా ఉండాలి.

• అధికారిక వెబ్‌సైట్ చిరునామా తెలిసినప్పుడు సెర్చ్‌ చేయకుండా నేరుగా అడ్రస్‌ బార్‌లో టైప్‌ చేయడం మరింత సురక్షితం.

• సెర్చ్‌ ఫలితాల్లో ‘స్పాన్సర్డ్’ లేదా ‘ఏడి’ అని ఉన్న లింకులను క్లిక్‌ చేసే ముందు రెట్టింపు జాగ్రత్త పాటించాలి.

• సైబర్‌ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి కాల్‌ చేయాలి లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలి.

ఆన్‌లైన్‌ ప్రపంచంలో అప్రమత్తతే అసలైన రక్షణ కవచమని వి.సీ. సజ్జనర్ మరోసారి గుర్తు చేశారు.