
సెమీస్‌కు భారత బ్యాడ్మింటన్ జట్టు
భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్ 2025 క్వార్టర్-ఫైనల్‌లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) జట్టును ఓడించి, ఈ పోటీల చరిత్రలో భారతదేశానికి మొదటి పతకాన్ని ఖాయం చేసింది. గురువారం నాడు గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ వెనుకబడి ఉన్నప్పటికీ అద్భుతంగా పుంజుకుని 44-45, 45-30, 45-33 తేడాతో విజయం సాధించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.
ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్ కొత్త రిలే ఫార్మాట్‌లో జరుగుతున్నాయి. ఇందులో ఉత్తమ మూడు సెట్ల విధానం ఉంటుంది. ఒక్కో సెట్‌లో ఐదు మ్యాచ్‌లు (మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) ఉంటాయి. ప్రతి సెట్‌ను 45 పాయింట్లు చేరుకున్న మొదటి జట్టు గెలుస్తుంది. ఒక జట్టు 9 పాయింట్లు చేరుకోగానే తదుపరి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రతి సెట్‌కు ఆటగాళ్లను మార్చుకునే అవకాశం జట్టుకు ఉంటుంది.
మ్యాచ్ సాగిందిలా
తొలి సెట్‌లో భారత్ నిరాశపరిచింది. బాయ్స్ డబుల్స్‌లో భార్గవ్ రామ్ అరిగెల, విశ్వ తేజ్ గొబ్బూరు 9-5 తేడాతో వెనుకబడ్డారు. ఆ తర్వాత గర్ల్స్ డబుల్స్‌లో వెన్నెల కె- రేషిక యు 10-9 తేడాతో గెలిచి లోటును ఒక పాయింట్‌కు తగ్గించారు. ఆ వెంటనే రౌనక్ చౌహాన్ సింగిల్స్‌లో 11-9తో గెలిచి కొరియా కంటే కేవలం ఒకే పాయింట్ వెనుక ఉండేలా చేశాడు. అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎదురైన ఓటమి కారణంగా ఉమెన్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా తన ప్రత్యర్థి కిమ్ హాన్ బీ 9 పాయింట్లు చేరకముందే 15 పాయింట్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతి పుంజుకున్నా, సెట్ పాయింట్ వద్ద చేసిన తప్పిదం వల్ల భారత్ 44-45 స్వల్ప తేడాతో సెట్‌ను కోల్పోయింది.
రెండో సెట్‌లో ప్లేయర్లను మార్చి భారత్ ఫలితం రాబట్టింది. డబుల్స్ ప్లేయర్లు లాల్‌రామ్‌సంగా-భార్గవ్ జోడీ, వెన్నెల-రేషిక తొలి రెండు గేముల్లో గెలవడంతో భారత్ ఆరు పాయింట్ల లీడ్ సాధించింది. ఆ తర్వాత భారత్ వెనక్కి తిరిగి చూడలేదు. ఉన్నతి కోర్టులోకి వచ్చే సమయానికి, భారత్ అప్పటికే 9 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. చివరి గేములో ఉన్నతి హుడా విజయాన్ని లాంఛనం చేసింది. భారత్ 45-30తో సెట్‌ను సునాయాసంగా గెలుచుకుంది.
నిర్ణయాత్మక మూడో సెట్ లో లాల్‌రామ్‌సంగా, భార్గవ్‌ల జోడీ భారత్‌కు 9-4 ఆధిక్యాన్ని ఇచ్చింది. అయితే మధ్యలో వెన్నెల, రేషికా జోడీ జోడీ కాస్త వెనుకబడటంతో కొరియా రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఈ సమయంలో రౌనక్ చౌహాన్ అద్భుతమైన ఆటతీరుతో 11-4 తేడాతో గెలిచి, భారత్‌కు నిర్ణయాత్మకమైన 5 పాయింట్ల ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత లాల్‌రామ్‌సంగా- బిస్త్ ఆ ఆధిక్యాన్ని 7 పాయింట్లకు పెంచగా, చివరగా ఉన్నతి హుడా 9-4 తేడాతో గెలిచి విజయాన్ని ఖరారు చేసింది.
సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్ చరిత్రలో మిక్స్‌డ్-టీమ్ ఈవెంట్‌లో భారతదేశానికి ఇది మొదటి పతకం (కనీసం కాంస్యం) ఖాయమైంది. సెమీ-ఫైనల్‌లో భారత్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇండోనేషియాతో శుక్రవారం తలపడనుంది.
