
సెమీకండక్టర్ రంగంలో భారత్ దూకుడు
భారత సెమీకండక్టర్ డిజైన్ ప్రోగ్రామ్ గణనీయమైన స్థాయికి చేరుకుందని, దీనివల్ల అంతర్జాతీయ చిప్ పరిశ్రమలో దేశం దూసుకుపోవడానికి సిద్ధంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సెమీకన్ ఇండియా ప్రోగ్రామ్ కింద 'డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్' పథకం ద్వారా ఎంపికైన 23 చిప్ డిజైన్ కంపెనీలతో ఆయన ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ సెమీకండక్టర్ డిజైన్ ప్రోగ్రామ్ ఇప్పుడు కేవలం ప్రణాళికల స్థాయి నుంచి వాస్తవ రూపంలోకి మారిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకే పరిమితం కాకుండా, పని చేసే ప్రాజెక్టుల దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల గ్లోబల్ చిప్ పరిశ్రమలో భారత్ దూసుకుపోవడానికి సిద్ధంగా ఉందని, స్టార్టప్‌లు కేవలం ఆలోచనలతో కాకుండా ప్రయోగాత్మక ప్రాజెక్టులతో ముందుకు రావడం వల్ల పెట్టుబడులు నిధుల సేకరణ కూడా గతంలో కంటే సులభతరం అవుతుందని ఆయన వివరించారు.
అనలాగ్ ఐపీ అభివృద్ధి
పరిశ్రమ నిపుణులతో జరిగిన చర్చలో యూఎస్బీ, పి.సి.ఐ.ఈ వంటి హై-స్పీడ్ అనలాగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అభివృద్ధిపై చిప్ కంపెనీలు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ, మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక లక్ష్యాలను నిర్దేశించారు. సాధారణ ఐపీల అభివృద్ధిని 24 నెలల్లో, అలాగే పూర్తి స్థాయి అనలాగ్ ఐపీల శ్రేణిని 36 నెలల్లో సాధించాలని ఆయన లక్ష్యంగా పెట్టారు. ఈ రకమైన అనలాగ్ ఐపీలు ప్రపంచవ్యాప్తంగా రియల్ వరల్డ్ అప్లికేషన్లకు చాలా కీలకమని, మన దేశంలో ఉన్న ప్రతిభను అంతర్జాతీయ సెమీకండక్టర్ కంపెనీలలో ఉన్న భారతీయ నిపుణుల అనుభవాన్ని ఉపయోగించుకుని ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భవిష్యత్తు ప్రణాళిక, స్వదేశీ ప్రాధాన్యత
డిజైన్ రంగంలో పాల్గొనే కంపెనీలకు ప్రభుత్వం సిడిఏసి ద్వారా ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్‌ను ఉచితంగా అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అన్నారు. అలాగే భవిష్యత్తులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ స్టాండర్డ్ ఐపీలను ఒక ప్రత్యేక 'డిఎల్ఏ రిపోజిటరీ'లో భద్రపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా, భారతదేశంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్‌లలో ఈ స్వదేశీ ఐపీలను వాడటం తప్పనిసరి చేసే దిశగా కూడా అడుగులు వేస్తామని మంత్రి సూచించారు. దీనివల్ల విదేశీ ఐపీలపై ఆధారపడటం తగ్గి, సెమీకండక్టర్ రంగంలో ఆత్మనిర్భరత సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం అంటే,
డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది భారతదేశాన్ని సెమీకండక్టర్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక గొప్ప ప్రోత్సాహక పథకం. ఈ పథకం కింద చిప్ డిజైన్ చేసే కంపెనీలకు అయ్యే ఖర్చులో 50% వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వారు రూపొందించిన డిజైన్ల విక్రయాలపై 4% నుండి 6% వరకు అదనపు నగదు ప్రోత్సాహకాలను (ఇన్సెంటివ్స్) ఇస్తుంది. వీటితో పాటు, చిప్ డిజైన్ చేయడానికి అవసరమైన అత్యంత ఖరీదైన సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను సి-డిఏసి ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తూ, స్టార్టప్‌లు, దేశీయ కంపెనీలు విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడకుండా సొంతంగా మేధో సంపత్తిని సృష్టించుకునేలా ఈ పథకం తోడ్పడుతోంది.
