Let's talk: editor@tmv.in
సెబీలో 110 ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టులు

సెబీలో 110 ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టులు

Shaik Mohammad Shaffee
13 అక్టోబర్, 2025

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 110 ఆఫీసర్ గ్రేడ్-ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద జనరల్ విభాగంలో 56 పోస్టులు, లీగల్ విభాగంలో 20 పోస్టులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 22 పోస్టులు, రీసెర్చ్ విభాగంలో 4 పోస్టులు, అధికార భాష విభగంలో 3 పోస్టులు, ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో 3, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో 2 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల విద్యార్హతల విషయానికి వస్తే, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీటెక్/బీఈ, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు సెప్టెంబర్ 30, 2025 నాటికి 30 సంవత్సరాలు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 దరఖాస్తు ఫీజుగా ఉంది.

ఎంపిక ప్రక్రియ

సెబీ ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదట స్క్రీనింగ్ కోసం ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. ఇందులో కూడా రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్ష కూడా క్లియర్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ, మెయిన్ పరీక్ష మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం సెబీ అధికారిక వెబ్‌సైట్

https://www.sebi.gov.in/ను సందర్శించండి.

సెబీ అంటే ఏమిటి?

సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్ (షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి) కార్యకలాపాలను నియంత్రించే అత్యున్నత సంస్థ. దీని ప్రధాన లక్ష్యం మార్కెట్లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, సెక్యూరిటీస్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, మార్కెట్‌ను నియంత్రించడం. ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, సెబీలో ఉద్యోగం చేయడాన్ని గౌరవంగా భావిస్తారు. ఈ సంస్థను 1988 సంవత్సరంలో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.

సెబీలో ఆఫీసర్ గ్రేడ్-ఏ పదోన్నతులు

సెబీలో ఆఫీసర్ గ్రేడ్-ఏ (అసిస్టెంట్ మేనేజర్)గా కెరీర్‌ను ప్రారంభించిన వారు గ్రేడ్-ఎఫ్ ఆఫీసర్ (చీఫ్ జనరల్ మేనేజర్) వరకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది. ప్రతిభావంతులైన ఆఫీసర్లు సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఎదగవచ్చు. గ్రేడ్-ఏ ఆఫీసర్లు వివిధ విభాగాలలో పనిచేస్తారు. వీరి పని విధానం పాలసీల రూపకల్పన, మధ్యవర్తుల రిజిస్ట్రేషన్, మార్కెట్ తనిఖీ, పర్యవేక్షణ, ఆర్థిక మోసాలపై దర్యాప్తు, న్యాయ నిర్ణయాలు వంటి ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఆకర్షణీయమైన జీతం

సెబీలో ఆఫీసర్ గ్రేడ్-ఏగా ఎంపికైన వారికి నెలకు రూ.62,500 - రూ.1,26,100 పే స్కేల్ వర్తిస్తుంది. అన్ని అలవెన్స్‌లు (డీఏ, హెచ్ఆర్ఏ, గ్రేడ్ అలవెన్స్, ఎన్‌పీఎస్ మొదలైనవి) కలుపుకొని, ముంబై వంటి మెట్రో నగరాల్లో వారి నెల జీతం సుమారు రూ.1,84,000 వరకు ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధిక వేతన ప్యాకేజీలలో ఒకటి.

సెబీలో 110 ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టులు - Tholi Paluku