Let's talk: editor@tmv.in
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Gaddamidi Naveen
26 ఆగస్టు, 2026

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో వెల్లడించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

తమ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. భూసేకరణ వేగవంతం కాకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావని స్పష్టం చేశారు. భూసేకరణ, పరిహారం, పునరావాసం, అటవీ అనుమతుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు.

అసెంబ్లీని సెప్టెంబర్‌లో సమావేశపరుస్తామని రేవంత్‌రెడ్డి ఈ నెల 16న ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని రేవంత్ రెడ్డి కోరారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్, తన 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై సభలో చర్చించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లన్నర కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పగించిన రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల భారంపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. సమావేశాలు ఏర్పాటు చేయాలని తరచుగా కోరుతున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు కూడా ఈ సభకు కేసీఆర్ వచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు.

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - Tholi Paluku