
సెప్టెంబర్ 2 నుంచి బీఆర్ఎస్ పోరుబాట
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఇప్పటివరకు అమలు చేసినవి, ఇంకా ప్రజలకు బాకీ ఉన్న హామీలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 1న చార్జిషీట్
వారం రోజుల నిరసన కార్యక్రమాలకు ముందు సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌ను విడుదల చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 2 నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 2న ఆరు గ్యారెంటీలపై ధర్నాలు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నారు. ‘420 హామీలు’ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు భారీ ఫ్లెక్సీల ప్రదర్శన నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఇంకా నెరవేర్చాల్సిన హామీలను వివరించే ‘బాకీ కార్డులు’ ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.
3న రైతు సమస్యలపై సదస్సులు
సెప్టెంబర్ 3న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, యూరియా, పంటల బీమా తదితర సమస్యలపై నియోజకవర్గాల వారీగా రైతు సదస్సులు నిర్వహించనున్నారు. హైదరాబాద్, అర్బన్ ప్రాంతాల్లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై నిరసనలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు.
4న మహిళలు, వికలాంగులతో కార్యక్రమాలు
మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తులం బంగారం తదితర హామీల అమలుపై నిరసనలు చేపట్టనున్నారు. అవసరమైన చోట్ల వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు.
5న యువతతో భారీ ర్యాలీలు
సెప్టెంబర్ 5న విద్యార్థులు, యువత సమస్యలపై పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
6న హైదరాబాద్‌లో ఆటోలతో ర్యాలీ
నగర సమస్యలపై సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలు, బస్తీ దవాఖానాల నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇతర స్థానిక సమస్యలపై నిరసనలు చేపట్టనున్నారు.
7న ప్రజావాణిలో వినతిపత్రాలు
సెప్టెంబర్ 7న జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాలని కేటీఆర్ సూచించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
8న జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు
వారం రోజుల కార్యక్రమాల అనంతరం సెప్టెంబర్ 8న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు నిర్వహించి నిరసన కార్యక్రమాలు, ప్రజల స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నారు. అదేరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని నిర్ణయించారు.
10న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు బీఆర్ఎస్ మద్దతు
సెప్టెంబర్ 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేపట్టనున్న నిరసనలకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే ఈ పోరుబాట ప్రధాన ఉద్దేశమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలను విస్తృతంగా, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. కార్యాచరణను పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని తెలిపారు.
