Let's talk: editor@tmv.in
సెన్సెక్స్ 558 పాయింట్లు పతనం

సెన్సెక్స్ 558 పాయింట్లు పతనం

Pinjari Chand
13 ఫిబ్రవరి, 2026

ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 558 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్ల 3 లక్షల కోట్ల సంపద అవిరైంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో అంతరాయాల భయాలు, అలాగే అమెరికా ఆర్థిక గణాంకాలు బలంగా ఉండటంతో ఫెడ్ వడ్డీరేటు కోతపై ఆశలు తగ్గిపోవడం పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీశాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 558.72 పాయింట్లు (0.66శాతం) పడిపోయి 83,674.92 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో గరిష్ఠంగా 716.97 పాయింట్లు (0.85శాతం) క్షీణించి 83,516.67 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 146.65 పాయింట్లు (0.57శాతం) తగ్గి 25,807.20 వద్ద ముగిసింది.

ఐటీ షేర్లలో భారీ నష్టాలు

టెక్నాలజీ షేర్లు పడిపోవడంలో ముందంజలో నిలిచాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దాదాపు 6శాతం వరకు క్షీణించి సెన్సెక్స్‌లో ప్రధాన నష్టాలుగా నిలిచాయి.హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్తాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎటర్నల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండిగో, కొటక్ మహీంద్రా బ్యాంక్, అదాని పోర్ట్స్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి.

మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, లార్సెన్ అండ్ టుబ్రో, భారతి ఎయిర్టెల్, టాటా స్టీల్ లాభాల్లో ముగిశాయి.

సూచీలు, రంగాల ప్రదర్శన

బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.48శాతం తగ్గింది. స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.28శాతం క్షీణించింది.

రంగాలవారీగా

ఫోకస్‌డ్ ఐటీ సూచీ 5.40శాతం పతనం కాగా, ఐటీ సూచీ 5.29శాతం, రియాల్టీ 1.50శాతం క్షీణించింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాలు 1.18శాతం చొప్పున పడిపోయాయి. సర్వీసెస్ 0.81శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.43శాతం, కన్స్యూమర్ డిస్క్రెషనరీ 0.38శాతం, కమోడిటీస్ 0.32శాతం తగ్గాయి. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్స్, టెలికమ్యూనికేషన్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బీఎస్ఈ టాప్ 10 బ్యాంక్స్ సూచీలు లాభాల్లో నిలిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,582 షేర్లు పడిపోగా, 1,634 షేర్లు లాభపడ్డాయి. 152 షేర్లు మార్పులేకుండా ముగిశాయి.

రూ.10 లక్షల కోట్ల దిగువకు టీసీఎస్ మార్కెట్ విలువ

టీసీఎస్ షేర్లు 5.41శాతం పడిపోవడంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా రూ.10 లక్షల కోట్ల దిగువకు చేరింది. ట్రేడింగ్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.9,95,661.50 కోట్లుగా నమోదై దేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఆరవ స్థానానికి చేరింది. అయితే దాదాపు 2శాతం లాభంతో ముగిసిన ఐసీఐసీఐ బ్యాంక్ టీసీఎస్‌ను అధిగమించి ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

విశ్లేషకుల అభిప్రాయాలు

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి సిద్ధార్థ ఖేమ్కా మాట్లాడుతూ మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగియడంతో మార్కెట్లు పరిమిత పరిధిలోనే కదలొచ్చు. గ్లోబల్, దేశీయ ద్రవ్యోల్బణం, వాణిజ్య పరిణామాలు, విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం తదితర అంశాలు ప్రభావం చూపవచ్చు. ఏఐ సంబంధిత అంతరాయాలు అస్థిరతను పెంచే అవకాశం ఉందని అన్నారు. అమెరికాలో జనవరి ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి రావడంతో సమీప కాలంలో ఫెడ్ వడ్డీరేటు కోతపై ఆశలు తగ్గాయని, అధునాతన ఏఐ మోడళ్లు సాంప్రదాయ ఐటీ సేవలను ఆటోమేట్ చేసే అవకాశంపై పెట్టుబడిదారుల్లో భయాలు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపారని, ఈ నెల 11వ తేదీ వరకు రూ.5,913 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారని తెలిపారు. జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ ఏఐ ప్రభావం కారణంగా సేవా రంగాల్లో మార్జిన్లు తగ్గే అవకాశం ఉంది. భారత్‌లో ఐటీ సేవల రంగంలో హెడ్‌కౌంట్ ఆధారిత ఔట్‌సోర్సింగ్ మోడల్‌కు ఇది సవాలుగా మారవచ్చు అని అన్నారు. అమెరికా-ఇరాన్ భౌగోళిక ఉద్రిక్తతలు కూడా పెట్టుబడిదారుల్లో జాగ్రత్త భావన పెంచుతున్నాయని ఆయన తెలిపారు.

గ్లోబల్ మార్కెట్లు

దక్షిణ కొరియా కోస్పి సూచీ 3శాతానికి పైగా లాభంతో ముగిసింది.

జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కంపోజిట్ లాభాల్లో ముగిశాయి.

హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీ నష్టాల్లో ముగిసింది.

యూరోపియన్ మార్కెట్లు మధ్యాహ్న ట్రేడింగ్‌లో లాభాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి.

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.27శాతం తగ్గి 69.21 డాలర్లకు చేరింది.

బుధవారం సెన్సెక్స్ 40.28 పాయింట్లు తగ్గి 84,233.64 వద్ద ముగియగా, నిఫ్టీ 18.70 పాయింట్లు పెరిగి 25,953.85 వద్ద ముగిసింది.