
సూర్య 47వ సినిమా ఘనంగా ప్రారంభం
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాక్-టు-బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇటీవలే 'కంగువ', 'రెట్రో' వంటి చిత్రాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవడంతో ఆయన ఇప్పుడు ఒక భారీ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే, తన 47వ చిత్రాన్ని ఆదివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ 47వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు జీతూ మాధవన్. ఆయన గతంలో 'రోమాంచమ్'తో తొలి విజయాన్ని అందుకుని, ఆ తర్వాత మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కించిన 'ఆవేశం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. 'ఆవేశం' ఊహించని రికార్డు కలెక్షన్లు రాబట్టింది. అలాంటి మాస్ ఎనర్జీ ఉన్న డైరెక్టర్, నటనలో వైవిధ్యం చూపించే సూర్యతో కలిసి పనిచేయడం, ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాతో జీతూ మాధవన్ కోలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు.
ఈ సినిమాలో సూర్య సరసన క్యూట్ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. నాని సరసన 'అంటే సుందరానికి' సినిమాలో నటించింది. చాలా కాలం తర్వాత ఇంతటి పెద్ద ప్రాజెక్ట్‌లో నజ్రియా భాగం కావడంతో ఆమె అభిమానులకు సంతోషిస్తున్నారు. మలయాళంలో 'ప్రేమలు', 'కొత్త లోక' వంటి సినిమాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను అలరించిన యువ హీరో నస్లెన్ కె. గఫూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్న ఈ యంగ్ హీరో, సూర్య సినిమాతో మరో విజయాన్ని అందుకుంటాడని భావిస్తున్నారు.
ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమాచారం. ఇందులో సూర్య ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని ఇన్‌సైడ్ టాక్. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్‌టైన్‌మెంట్'కు బదులుగా, ఈ సినిమా కోసం కొత్త నిర్మాణ సంస్థ 'జాగారం స్టూడియోస్'ను ప్రారంభించారు. ఈ సినిమాలో సూర్య, జీతూ మాధవన్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సుశిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, వినీత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే ప్రారంభం కానుంది.
సూర్య ప్రస్తుత ప్రాజెక్టుల వివరాలు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 47వ సినిమాతో పాటు ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్టుల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అందులో మొదటిది, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'కరుప్పు'. ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తి కావొస్తున్నాయి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక రెండో సినిమా, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సుర్య 46'. ఈ చిత్రం కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సూర్యకు, జీతూ మాధవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా తప్పకుండా బ్రేక్ ఇస్తుందని, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
