Let's talk: editor@tmv.in
సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

Pinjari Chand
27 ఆగస్టు, 2026

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు 44 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు.. ఉదయం 5 గంటల సమయంలో కోదాడ మండలం పరిధిలో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. లారీలో పరిశ్రమల్లో వినియోగించే భారీ ఇనుప స్తంభాలు ఉన్నాయి. లారీ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని అక్కడే నిలిచిపోయింది. ఆ తర్వాత వెనుక నుంచి వచ్చిన బస్సు లారీని ఢీకొనడంతో ఇనుప స్తంభాలు బస్సు కుడివైపు భాగాన్ని బలంగా తాకాయి. దీంతో ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన 17 మందిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడలోని ఆసుపత్రికి తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు.

మెరుగైన వైద్యం అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రహదారి భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, హైవేలపై ట్రాఫిక్‌ పోలీసుల నిఘాను పెంచాలని కోరారు. తెల్లవారుజామున డ్రైవర్లు నిద్రమత్తులో ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

‘సూర్యాపేటలో జరిగిన విషాదకర ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

అతివేగమే కారణమా?

ప్రాథమిక దర్యాప్తులో బస్సు అతివేగంగా ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన వారని, వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.