Let's talk: editor@tmv.in
సూర్యవంశీ 'సిక్సర్ల' సునామీ.. రాజస్థాన్ ఘన విజయం
సూర్యవంశీ 'సిక్సర్ల' సునామీ.. రాజస్థాన్ ఘన విజయం

సూర్యవంశీ 'సిక్సర్ల' సునామీ.. రాజస్థాన్ ఘన విజయం

Shaik Mohammad Shaffee
31 మార్చి, 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయంతో శుభారంభం చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలర్లు చెన్నైని తక్కువ స్కోరుకే పరిమితం చేయగా, అనంతరం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే అర్థసెంచరీ బాది రాయల్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

సూర్యవంశీ విధ్వంసం.. జైస్వాల్ సహకారం

128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గతేడాది ఐపీఎల్‌లోనే రికార్డు సెంచరీతో మెరిసిన ఈ యువ ఆటగాడు, ఇప్పుడు సీఎస్‌కే బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఒకే ఓవర్‌లో 18 పరుగులు రాబట్టిన సూర్యవంశీ క్యాచ్‌ను కార్తీక్ శర్మ వదిలేయడంతో అతడికి మరో అవకాశం లభించింది . ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వైభవ్ మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ వంటి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించి ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (38 నాటౌట్) అతడికి చక్కని సహకారం అందించగా, చివరలో రియాన్ పరాగ్ (14 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో రాయల్స్ 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

బౌలర్ల ధాటికి కుప్పకూలిన చెన్నై

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. వర్షం కారణంగా పిచ్‌పై ఉన్న తేమను ఉపయోగించుకున్న నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలోనే చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశారు. సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేసిన స్టార్ ప్లేయర్ సంజు శామ్సన్.. బర్గర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆర్చర్ వేగవైన బంతికి వికెట్లు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయుష్ మాత్రే కూడా డకౌట్ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది.

జడేజా మ్యాజిక్.. నిరాశపరిచిన మిడిలార్డర్

గత సీజన్ తర్వాత జడేజా, శామ్సన్ ఒకరి జట్టు నుంచి మరొకరికి మారిన విషయం తెలిసిందే. తిరిగి రాజస్థాన్ గూటికి చేరిన రవీంద్ర జడేజా తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి చెన్నై వెన్ను విరిచాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), శివమ్ దూబే (6) జడేజా బౌలింగ్‌లో వెనుదిరగడంతో చెన్నై 57 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చివర్లో జేమీ ఓవర్టన్ (43) ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై ఎలాగోలా 127 పరుగులు చేయగలిగింది. అరంగేట్రం చేసిన మీడియం పేసర్ బ్రిజేష్ శర్మ కూడా ఒక వికెట్ పడగొట్టగా.. ఆర్చర్, బర్గర్, జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి.