Let's talk: editor@tmv.in
సూరత్–కర్నూల్ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే:నితిన్ గడ్కరీ

సూరత్–కర్నూల్ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే:నితిన్ గడ్కరీ

Pinjari Chand
12 మార్చి, 2026

ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంతో మరింత వేగంగా కలపడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఢిల్లీ–చెన్నై మధ్య దూరం సుమారు 320 కిలోమీటర్లు తగ్గుతుందని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే సూరత్‌ నుంచి ప్రారంభమై నాశిక్‌, ఆహ్మద్‌నగర్‌‌, సోలాపూర్‌‌ మీదుగా కర్నూల్‌ వరకు నిర్మించనుంది. అక్కడి నుంచి ఇది బెంగుళూర్, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, కొచ్చి వంటి నగరాలకు అనుసంధానం కల్పిస్తుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఢిలీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే 70–80 శాతం వరకు పూర్తైందని గడ్కరీ చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ముంబై–ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ దిశగా వెళ్లే భారీ ట్రాఫిక్ ప్రస్తుతం ఆహ్మదాబాద్, వడోదరా, ముంబై, పుణే, కోల్హపూర్‌‌ మార్గంగా వెళ్తుండటంతో రద్దీ పెరుగుతోందని మంత్రి తెలిపారు. కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభించడమే కాకుండా ప్రయాణ సమయం, రవాణా ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతాయని ఆయన చెప్పారు.

జేవర్ విమానాశ్రయానికి కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడార్

కేంద్ర కేబినేట్‌ జేవర్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా అనుసంధానం కల్పించే గ్రీన్‌ఫీల్డ్ కనెక్టివిటీ కారిడార్ నిర్మాణానికి రూ.3,630.77 కోట్ల సవరించిన వ్యయాన్ని ఆమోదించింది. సుమారు 31.42 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని ఢిల్లీ–ఫరీదాబాద్–బల్లభ్గఢ్–సోహ్నా స్పర్ నుంచి జేవర్ విమానాశ్రయం వరకు నిర్మిస్తారు. హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హెచ్‌ఏఎం) పద్ధతిలో ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మీదుగా ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. ఈ కారిడార్ ద్వారా దక్షిణ ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి జేవర్ విమానాశ్రయానికి వేగవంతమైన రహదారి అనుసంధానం ఏర్పడుతుందని, దీనివల్ల నేషనల్‌ క్యాపిటల్‌ రిజీయన్‌లో రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని కేంద్రం తెలిపింది.