
సూరజ్‌కుండ్ మేళాలో ‘జాయ్‌రైడ్’ ప్రమాదం
సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళాలో భారీ ‘ట్సునామీ’ స్వింగ్ మధ్యలోనే విరిగి కూలిపోవడంతో విధుల్లో ఉన్న ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్ మృతి చెందగా, మరో 11 మంది గాయపడిన ఘటనపై స్వింగ్ ఆపరేటర్‌తో పాటు, సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా చెందిన ‘హిమాచల్ ఫన్ కేర్’ యజమాని మొహమ్మద్ షకీర్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సంస్థ ప్రమాదానికి గురైన స్వింగ్‌ను నిర్వహిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాద సమయంలో సుమారు 19 మంది స్వింగ్‌లో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా ఊయల ఒక వైపు వాలిపోవడంతో అది నేలకూలి ఘోర ప్రమాదం సంభవించింది.
ప్రమాద సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ జగ్గదీశ్ ప్రసాద్ స్వింగ్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ధైర్యంగా ప్రయత్నించారని, అయితే ఆ సమయంలో ఆయనకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 1989లో హర్యానా ఆర్మ్డ్ పోలీస్‌లో చేరిన ప్రసాద్, 36 ఏళ్ల సేవల అనంతరం ఈ మార్చిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది.
ఎఫ్‌ఐఆర్‌కు ఆధారంగా ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సన్నీ తెలిపిన వివరాల ప్రకారం, స్వింగ్ మధ్యలో విరిగిన వెంటనే ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రక్షణ చర్యలకు దిగారు. అయితే ఊయల ఒక వైపు నుంచి పూర్తిగా విరిగి వారిపై పడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
సిట్ ఏర్పాటు
ఘటనపై లోతైన దర్యాప్తు కోసం నలుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డీసీపీ (క్రైమ్) ముఖేష్ కుమార్ నేతృత్వంలోని ఈ బృందంలో ఏసీపీ వరుణ్ దహియా, సబ్‌ఇన్‌స్పెక్టర్ సంజయ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై సిట్ విచారిస్తుంది.
భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారని స్వింగ్ యజమాని, సిబ్బందిపై ఫిర్యాదులో ఆరోపించారు. 2019–20లో హర్యానా గవర్నర్ చేతుల మీదుగా పోలీస్ మెడల్ పొందిన ప్రసాద్ మృతి పోలీస్ శాఖకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, విచారణ పూర్తయ్యే వరకు జాయ్‌రైడ్ ప్రాంతాన్ని మూసివేసి, మేళాను కొనసాగించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.
హర్యానా డీజీపీ సంతాపం
సూరజ్‌కుండ్ మేళా ప్రాంగణంలో జాయ్‌రైడ్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇన్‌స్పెక్టర్ జగ్గదీశ్ ప్రసాద్ మృతిపై హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగాల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించేందుకు ప్రయత్నిస్తూ ఆయన చూపిన అపూర్వ ధైర్యం, అంకితభావం పోలీసు సేవల ఉన్నత సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని డీజీపీ కొనియాడారు.
ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన జగ్గదీశ్ ప్రసాద్ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ తన ప్రాణాల కంటే ఇతరుల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారని డీజీపీ సింగాల్ అన్నారు. ఆయన సకాలంలో స్పందించినందువల్ల పలువురు ప్రాణాలు నిలిచాయని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి రూ.1 కోట్ల బీమా మొత్తం తో పాటు ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు అందజేస్తామని డీజీపీ ప్రకటించారు. ఈ కష్ట సమయంలో హర్యానా పోలీస్ శాఖ కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డీజీపీ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. వారి చికిత్స పురోగతిపై వైద్యులతో చర్చించి, ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు.
