
సూపర్‌డూపర్ మూన్
ఆకాశం నిండా వెండి వెలుగులు విరజిమ్మే ఆ చంద్రుడు.. ఎప్పుడూ మనసును తాకుతూనే ఉంటాడు. చీకటి రాత్రికి కాంతి ఇస్తాడు.. మనసుకు శాంతిని ఇస్తాడు. చూసిన ప్రతిసారి కొత్తగా అనిపించే ఆ రూపం.. మన కలల్లోనూ, మన కథల్లోనూ, మన పాటల్లోనూ జీవిస్తుంది. అందుకే జాము రాతిరి జాబిలమ్మా అని వెంకటేశ్ పాడినా.. జాబిలమ్మ నీకు అంత కోపమా అని వడ్డె నవీన్ పాడినా మనసుకు హాయిగా ఉంటుంది. అందులో కొన్ని రాత్రులు మరింత ప్రత్యేకం. ఆ రాత్రుల్లో చంద్రుడు కొంచెం పెద్దగా, కొంచెం దగ్గరగా, కొంచెం ఎక్కువగా ప్రకాశిస్తాడు. అప్పుడు ఆకాశం మరింత అందంగా మారుతుంది.. మనసు ఆ వెలుగులో తేలిపోతుంది. అలాంటి రాత్రినే మనం 'సూపర్ మూన్' అంటాం. ఇది కేవలం ఆకాశపు ఘటన కాదు.. మన హృదయాన్ని తాకే ఒక మంత్రముగ్ధ క్షణం. అక్టోబర్ 6న చంద్రుడి అందాన్ని మిస్ అయ్యాం అనుకునేవాళ్లు బాధపడొద్దు.. ఎందుకంటే నవంబర్ 5న సూపర్‌మూన్ రూపంలో జాబిల్లి మరోసారి కనువిందు చేయనుంది.
ఇటు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న మార్గం వృత్తం కాదు.. కొంచెం అండాకారంలో ఉంటుంది. అందుకే, కొన్నిసార్లు చంద్రుడు మనకు కొంచెం దగ్గరగా వస్తాడు.. కొన్నిసార్లు కొంచెం దూరంగా వెళ్తాడు. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే బిందువును 'పెరిజీ' అంటారు. ఆ సమయంలో చంద్రుడు సుమారు 3లక్షల 63 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఒకవేళ దూరంగా వెళ్తే అప్పుడు 'అపోజీ' అంటారు. ఆ సమయంలో దూరం సుమారు 4లక్షల కిలోమీటర్లు ఉంటుంది. పెరిజీ సమయంలో చంద్రుడు పౌర్ణమిగా ఉన్నప్పుడు 'సూపర్ మూన్' కనిపిస్తుంది. ఆ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశంగా కనిపిస్తాడు. మన కంటికి తేడా అంతగా అనిపించకపోయినా, ఆకాశం మొత్తం వెలుగుతో నిండిపోతుంది. ఆ వెలుగులో భూమి మెరిసిపోతుంది, సముద్రం మెదులుతుంది.. మనసు ఆ మాయాజాలంలో తేలిపోతుంది.
నిజానికి చంద్రుడు కేవలం ఆకాశంలోనే కాదు.. భూమిపై కూడా తన ప్రభావాన్ని చూపుతాడు. మన సముద్రాల ఊపిరి, తరంగాల లయ లాంటివి చంద్రుడి ఆకర్షణతో ముడిపడి ఉంటాయి. సూపర్ మూన్ వచ్చినప్పుడు చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. దీంతో ఆయన ఆకర్షణ శక్తి కొంచెం పెరుగుతుంది. ఆ సమయంలో సముద్ర తరంగాలు మరింత ఎత్తుకు ఎగసిపడతాయి. మనకు పెద్ద మార్పులా అనిపించకపోయినా, సముద్రం ఆ లయలో స్వల్పంగా మారుతుంది. ఆ సమయంలో ప్రకృతి మొత్తం ఒక కొత్త మాధుర్యాన్ని పొందుతుంది. ఇటు చంద్రుడు భూమికి కేవలం ఓ శాటిలైట్ మాత్రమే కాదు.. ఆయన మన సంస్కృతిలో ఓ భాగం కూడా. అందుకే తెలుగు సాహిత్యంలో ఆయన రూపం ఎన్నో సార్లు వెలుగుతుంది. చంద్రబింబం ప్రేమకు, ఆత్మీయతకు, అందానికి గుర్తుగా నిలిచింది. మన పండుగల్లో పౌర్ణమి రాత్రి ప్రత్యేక స్థానం పొందింది. పెద్దలు చంద్రుణ్ణి చూసి ఆశీర్వదిస్తారు.
పిల్లలు చంద్రుడి గురించి పాటలు పాడుతారు. ప్రేమికులు చంద్రకాంతిలో కలలుగంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి మనసులోనూ చంద్రుడు ఏదో ఒక జ్ఞాపకంగా జీవిస్తాడు.
ఇటు నవంబర్ 5న రానున్న సూపర్‌మూన్ 2025లో సంభవించే అత్యంత ప్రకాశవంతమైనది. ఆకాశం నిండా వెండి కాంతి విరబూసే రోజు అది. ఆ కాంతిలో చెట్లు, ఇళ్లు, సముద్రం ..ఇలా అన్నీ ఒకే వెలుగులో తేలిపోతాయి. మన కళ్లకు అది ఒక స్వప్నంలా అనిపిస్తుంది. ఆ రాత్రి మీరు బయటికి వెళ్లి ఆకాశాన్ని చూడండి.. దీపాలు అవసరం ఉండవు. చంద్రుడి వెలుగే మీ చుట్టూ వెదజల్లుతుంది. ఆ క్షణం ఆకాశం జీవంతో నిండిపోతుంది. ఈ సూపర్ మూన్ మనకు ఆకాశం ఎంత అందంగా ఉంటుందో గుర్తు చేస్తుంది. మన జీవితం ఎంత చిన్నదో, ఎంత విలువైనదో కూడా గుర్తుచేస్తుంది. ఇక ప్రతి సారి ఆయన పౌర్ణమిగా వెలిగినప్పుడు.. మనలోని చీకట్లు కొద్దిగా తొలగిపోతాయి. మనసు తేలిక అవుతుంది.. ఆ వెలుగు మనలోకి వచ్చి నిలిచిపోతుంది. అందుకే సూపర్ మూన్ అనేది కేవలం ఒక దృశ్యం కాదు.. అది మన ఆత్మను తాకే ఒక అనుభూతి.. ఆ సూపర్ మూన్ రాత్రి భూమి ప్రశాంతంగా ఉంటుంది.. ఆకాశం నవ్వుతుంది.. మనసు మాత్రం హాయిగా మారిపోతుంది. అందుకే డోంట్ మిస్ ఇట్..!
