
సూడాన్ అంతర్యుద్ధం: మూడు రోజుల్లో 6,000 మందికి పైగా మృతి!
ఆఫ్రికా దేశం సూడాన్‌లో అంతర్యుద్ధం బీభత్సం సృష్టిస్తోంది. ఆ దేశ పారామిలిటరీ దళమైన 'ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్' (ఆర్‌ఎస్‌ఎఫ్) దార్ఫుర్ ప్రాంతంలో జరిపిన దాడులు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గతేడాది అక్టోబరు చివరి వారంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో 6,000 మందికి పైగా అమాయక ప్రజలను ఆర్‌ఎస్‌ఎఫ్ దళాలు దారుణంగా పొట్టనబెట్టుకున్నాయని ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎల్-ఫాషర్ నగరాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో జరిగిన ఈ దాడులు అత్యంత క్రూరంగా, అమానవీయంగా సాగాయని ఐరాస మానవ హక్కుల విభాగం శుక్రవారం విడుదల చేసిన 29 పేజీల నివేదికలో పేర్కొంది.
యూనివర్సిటీ ప్రాంగణంలో మారణకాండ
ఉత్తర దార్ఫుర్ రాజధాని అయిన ఎల్-ఫాషర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్‌ఎస్‌ఎఫ్ దళాలు, వారికి మద్దతుగా ఉన్న అరబ్ మిలీషియాలు (జంజావీద్) అక్టోబరు 26న విరుచుకుపడ్డాయి. నగరంలోని యూనివర్సిటీ హాస్టల్‌లో ఆశ్రయం పొందుతున్న దాదాపు 1,000 మందిపై భారీ ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 500 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే శవాలు గాలిలోకి ఎగిరిపడుతుంటే ఏదో భయంకరమైన సినిమా చూస్తున్నట్లు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో ఘటనలో యూనివర్సిటీ ప్రాంగణంలోనే 50 మంది చిన్నారులతో సహా సుమారు 600 మందిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. అక్టోబరు 25 నుంచి 27 మధ్య నగరంలో 4,400 మంది, నగరం విడిచి పారిపోయే క్రమంలో మరో 1,600 మంది బలయ్యారు.
ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై కనికరం లేని దాడులు
ఆర్‌ఎస్‌ఎఫ్ దళాల వికృత చేష్టలకు ఆఖరికి ఆసుపత్రులు కూడా బలియ్యాయి. అక్టోబరు 28న సౌదీ మెటర్నిటీ ఆసుపత్రిపై జరిపిన దాడిలో మరో 460 మందిని పొట్టనబెట్టుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. అంతకుముందు అబూ షౌక్ శరణార్థి శిబిరంపై డ్రోన్లు, ఫిరంగులతో జరిపిన దాడుల్లో 300 మంది మరణించారు. నగరాన్ని ఆక్రమించిన తర్వాత స్థానిక చిన్నారుల ఆసుపత్రిని ఏకంగా చిత్రహింసలు పెట్టే నిర్బంధ కేంద్రంగా మార్చేశారని నివేదిక వెల్లడించింది. వేల సంఖ్యలో ప్రజలు ఇప్పటికీ అదృశ్యమయ్యారని, వాస్తవ మరణాల సంఖ్య నివేదికలో పేర్కొన్న దానికంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐరాస హెచ్చరించింది.
మహిళలపై అమానుషం.. ఆయుధంగా లైంగిక దాడి
ఈ యుద్ధంలో మహిళలు, యువతులపై జరుగుతున్న అకృత్యాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆఫ్రికన్ 'జఘవా' తెగకు చెందిన మహిళలే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎఫ్ దళాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నాయని ఐరాస నివేదిక స్పష్టం చేసింది. లైంగిక దాడిని ఒక 'యుద్ధ ఆయుధం'గా మలచుకుని బాధితులను మానసికంగా, శారీరకంగా కృంగదీస్తున్నారని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మందిని కిడ్నాప్ చేసి, భారీగా నగదు చెల్లిస్తే తప్ప వదిలిపెట్టడం లేదని పేర్కొన్నారు.
శిక్షించకపోవడమే శాపమైంది: ఐరాస
సూడాన్ సైన్యానికి, ఆర్‌ఎస్‌ఎఫ్ దళాలకు మధ్య 2023 ఏప్రిల్‌లో మొదలైన ఈ అధికార పోరాటం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంక్షోభానికి దారితీసింది. పాత నేరాలకు బాధ్యులను శిక్షించకుండా వదిలేయడం వల్లే, ఆర్‌ఎస్‌ఎఫ్ దళాలు పదేపదే ఇలాంటి మారణకాండలకు పాల్పడుతున్నాయని వోల్కర్ టర్క్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులు ముమ్మాటికీ యుద్ధ నేరాలని, వీటిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తు జరుపుతోందని తెలిపారు. కాగా, ఈ ఆరోపణలపై ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకత్వం స్పందించలేదు. దేశం క్షామం కోరల్లో చిక్కుకుని ప్రజలు అల్లాడుతుంటే, ఈ రక్తపాతం ఆగకపోవడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అధికారం కోసం పోరు.. జాతి వివక్షే కారణం
సూడాన్‌లో ప్రస్తుత నరమేధానికి ప్రధాన కారణం అధికారం కోసం ఇద్దరు సైనిక నాయకుల మధ్య మొదలైన ఆధిపత్య పోరు. ఒకప్పుడు దేశాధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ హయాంలో తిరుగుబాటుదారులను అణచివేయడానికి 'జంజావీద్' అనే అరబ్ మిలీషియాల నుంచి ఆర్‌ఎస్‌ఎఫ్ అనే పారామిలిటరీ దళాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, 2023 ఏప్రిల్‌లో దేశ అధికారిక సైన్యం (ఎస్ఏఎఫ్) అధిపతి అబ్దెల్ ఫతా అల్-బుర్హాన్, ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకుడు మహమ్మద్ హమ్దాన్ దగాలో (హిమెడ్తి) మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆర్‌ఎస్‌ఎఫ్ దళాన్ని అధికారిక సైన్యంలో ఎలా విలీనం చేయాలి, దేశ పాలనపై ఎవరికి పట్టు ఉండాలనే విషయంలో కుదరని ఏకాభిప్రాయం కాస్తా పూర్తిస్థాయి అంతర్యుద్ధానికి దారితీసింది. అంటే, ఒకప్పుడు ప్రభుత్వం తరఫున పోరాడిన ఈ దళమే ఇప్పుడు అదే ప్రభుత్వ సైన్యంపై తిరగబడి దేశాన్ని స్మశానవాటికగా మారుస్తోంది.
ఈ యుద్ధం వెనుక దశాబ్దాల నాటి భయంకరమైన జాతి వివక్ష దాగి ఉంది. దార్ఫుర్ ప్రాంతంలోని అరబ్ తెగలకు, అరబ్-యేతర నల్లజాతి ఆఫ్రికన్ తెగలకు మధ్య చారిత్రక వైషమ్యాలు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎఫ్ దళం ప్రధానంగా అరబ్ మిలీషియా సభ్యులతో కూడి ఉండటంతో, వారు ఉత్తర దార్ఫుర్‌లోని ఏకైక సైనిక పట్టుకొమ్మ అయిన ఎల్-ఫాషర్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో అక్కడి ఆఫ్రికన్ తెగలపై (ముఖ్యంగా జఘవా తెగ) పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ నగరాన్ని హస్తగతం చేసుకోవడానికి యూనివర్సిటీలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలను సైతం లక్ష్యంగా చేసుకుని సామూహిక హత్యలు, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ పోరాటం కేవలం ఇద్దరు జనరల్స్ మధ్య యుద్ధంలా కాకుండా, ఒక జాతిని నిర్మూలించే నరమేధంగా మారిందని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా హెచ్చరిస్తోంది.
