
సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యం : సీఎం చంద్రబాబు
ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం అనంతరం ప్రజావేదిక సభలో సీఎం పాల్గొన్నారు.
సీఎం మాట్లాడుతూ.. ప్రజల్లోనే ఉంటూ సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. “ఇంట్లో కూర్చుని బటన్ నొక్కడం కాకుండా ప్రజల మధ్యకు వచ్చి స్వయంగా పింఛన్‌లు పంపిణీ చేస్తున్నాం” అన్నారు. గత పాలకులు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్‌ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పుడు మూడు గంటల్లోనే పెన్షన్‌లు అందుతున్నాయని చెప్పారు.
పింఛన్లపై రూ.50,764 కోట్లు – దేశంలోనే రికార్డు
పింఛన్ల పంపిణీపై ఇప్పటివరకు రూ.50,764 కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. వీటిలో 59 శాతం మహిళలకు అందిందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, గీత కార్మికులు వంటి 28 వర్గాలకు పింఛన్‌లు ఇస్తున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద డీబీటీ అని పేర్కొన్నారు. కొత్తగా 8,151 వితంతువులకు పెన్షన్‌లు మంజూరు చేశామని సీఎం తెలిపారు.
తుఫాను నష్టాన్ని టెక్నాలజీతో తగ్గించాం
మొంథా తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.5,244 కోట్ల నష్టం జరిగినా టెక్నాలజీ సాయంతో నష్టాన్ని గణనీయంగా తగ్గించామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేశారని, ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపించామని ఆయన తెలిపారు.
కాశీబుగ్గ దుర్ఘటనపై విచారం
కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సభ ప్రారంభంలో 2 నిమిషాల మౌనం పాటించి మృతులకు నివాళి అర్పించారు.
ఫేక్ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది
“ఫేక్ పార్టీ”గా పేర్కొంటూ ప్రత్యర్థులపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. రాజకీయ లాభం కోసం కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుంది
చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్యకేసులో కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయం గెలిచిందని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. విశాఖలో గూగుల్ రూ.1.33 లక్షల కోట్లతో డేటా సెంటర్, అనంతపురంలో కియా పరిశ్రమలు రాష్ట్రంపై విశ్వాసం ప్రతీకలని అన్నారు.
పుట్టపర్తి అభివృద్ధి ఆధ్యాత్మిక దిశలో
పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలను నవంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రత్యేక మంత్రుల కమిటీని నియమించామని తెలిపారు. కదిరి శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయాన్ని దివ్యక్షేత్రంగా మార్చే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు.
