
సురినామ్‌లో దారుణం: కన్నబిడ్డలతో సహా 9 మందిని చంపిన కసాయి తండ్రి
సురినామ్ రాజధాని పరమరిబోకు సమీపంలోని రిచెలీయు అనే ప్రాంతంలో ఆదివారం ఒక వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. 43 ఏళ్ల నిందితుడు తన భార్యతో ఫోన్‌లో గొడవ పడ్డాడు. విడివిడిగా ఉంటున్న వీరిద్దరి మధ్య పిల్లల విషయంలో వాగ్వాదం జరిగింది. "పిల్లలను తీసుకెళ్లడానికి నేను రాను, వేరే ఎవరినైనా పంపిస్తాను" అని భార్య చెప్పడంతో కోపోద్రిక్తుడైన ఆ తండ్రి, తన కన్నబిడ్డలపైనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
అడ్డువచ్చిన పొరుగువారిని కూడా..
పిల్లల అరుపులు విని వారిని కాపాడేందుకు పరుగెత్తుకు వచ్చిన ఇరుగుపొరుగు వారిని కూడా ఆ నిందితుడు వదలలేదు. ఇళ్లలోకి చొరబడి కత్తితో దాడి చేయడంతో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అందరినీ కలిచివేసే విషయం ఏమిటంటే.. చనిపోయిన వారిలో ఆ నిందితుడి సొంత బిడ్డలే ఐదుగురు ఉన్నారు. తన కన్నపిల్లలను చంపడమే కాకుండా, వారిని రక్షించడానికి వచ్చిన పొరుగువారిని కూడా ఆ తండ్రి పొట్టనబెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.
నిందితుడి అరెస్ట్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, నిందితుడు వారిపై కూడా దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడటంతో అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సురినామ్ అధ్యక్షురాలు జెన్నిఫర్ గీర్లింగ్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
డచ్ వలస పాలనలో ఉన్న సురినామ్ దక్షిణ అమెరికాలోని చిన్న దేశాల్లో ఒకటి. ఇక్కడ హత్యల రేటు సాధారణంగా తక్కువగానే ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే 2024లో అక్కడ హత్యల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. లక్ష జనాభాకు దాదాపు 30 హత్యలు జరుగుతున్నట్లు 'ఇన్‌సైట్ క్రైమ్' అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
