
సుప్రీం సీజేఐపై దాడి హేయం
సనాతన ధర్మం పేరిట సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయమైనదని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గిరిజన, దళిత, మైనార్టీ ఐక్యసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన ఘటన కేవలం న్యాయవ్యవస్ధపైనే కాకుండా మొత్తం జాతి మీద జరిగిన ఘటన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రజలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. సనాతన ధర్మం ఎలా ఉంటుందో ఈ ఘటనతో దేశం మొత్తానికి ఒక హెచ్చరిక లాంటిదన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనువాద, మతోన్మాద దాడులతో మొత్తం వ్యవస్థలనే ధ్వంసం చేస్తున్నారన్న విషయాన్ని ఈ ఘటనతోనైనా గుర్తించాలన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఘటనను ఖండిరచిన్పటికీ వారు ఈ మతోన్మాదాన్ని నెత్తిన పెట్టుకోవడం వల్లనే ఈ దుర్గతి ఏర్పడిరదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇచ్చిన అలుసు వలనే ఈ ఘటన జరగడానికి ప్రధానమైందన్నారు. మనువాద భావజాలం మొత్తం అన్ని రంగాలకు విస్తరించిన నేపధ్యంలో ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే అధికారం పోతుందనే స్థాయిలో ప్రజలు వారికి బుద్ధి చెప్పేలా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో దానిని బలపరిచే వారు ఇప్పటికైనా దాని ప్రమాదాన్ని గమనించి దాని నుంచి బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
