Let's talk: editor@tmv.in
సుప్రీం కోర్టు ముందు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు

సుప్రీం కోర్టు ముందు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు

Pinjari Chand
4 నవంబర్, 2025

దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సమాధాన అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంతో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన బెంచ్ ఎదుట సోమవారం వారు హాజరయ్యారు. తమ వైఫల్యంపై బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్లు సమర్పించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎస్ లు హజరయ్యారు. బీహార్ ఎన్నికలు ఉన్న కానీ ఆ రాష్ట్ర సీఎస్ కూడా కోర్టు ముందు హాజరయ్యారు. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియా లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఉద్యోగులు కుక్కలకు ఆహారం వేస్తూ ప్రోత్సహిస్తున్న సందర్భాలపై మేం ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోతున్నామని బెంచ్ పేర్కొంది. నవంబర్‌ 7న కుక్కల దాడులకు బలైన బాధితుల వాంగ్మూలాలు కూడా వింటామని తెలిపింది.

సుప్రీంకోర్టు అక్టోబర్ 27న తెలంగాణ, పశ్చిమ బెంగాల్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కేవలం ఢిల్లీ ఎంసీడీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ మాత్రమే తమ అఫిడవిట్లు సమర్పించాయని అప్పట్లో కోర్టు తెలిపింది.

నిత్యం కుక్కల దాడులు జరుగుతున్నాయి. ప్రపంచం ముందు దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. మేం కూడా మీడియా రిపోర్టులు నిరంతరం చూస్తున్నామని జస్టిస్ నాథ్ వ్యాఖ్యానించారు. ఆగస్టు 22న సుప్రీంకోర్టు వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన ‘యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్’ అమలు చేస్తున్న తీరుపై రాష్ట్రాలు, యుటీలకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆగస్టు 11న ఇద్దరితో కూడిన ధర్మాసనం ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో అన్ని కుక్కలను పట్టుకుని షెల్టర్‌లలో ఉంచి వీధుల్లోకి విడవొద్దని ఆదేశించింది. ఆగస్టు 22న ముగ్గురితో కూడిన ధర్మాసనం ఆ ఆదేశాన్ని సవరించింది. కొత్త ఆదేశాల ప్రకారం స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్‌ చేసిన కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదిలేయవచ్చని, కానీ రేబీస్‌ బారిన పడినవి, హింసాత్మక ప్రవర్తన చూపిస్తున్నవాటిని మాత్రం వదలరాదని స్పష్టం చేసింది.

ఇకపై ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో కుక్కలకు ఆహారం వేయడాన్ని నియంత్రించడానికి సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు ఇవ్వనుంది.

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌ ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37,15,713 కుక్కలు కొరికిన ఘటనలు నమోదయ్యాయి. కేవలం ఢిల్లీలోనే 25,201 కేసులు ఉన్నట్లు సమాచారం.

లోపం ఎక్కడ?

సుప్రీం కోర్టు కుక్కల నియంత్రణకు ఆదేశాలిచ్చినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అందుకు ప్రధానంగా ఉన్న కారణాలు

సామాజిక సమస్యగా భావించడం

రాష్ట్ర ప్రభుత్వాలు వీధి కుక్కల సమస్యను ప్రజా ఆరోగ్య, భద్రతా అంశంగా కాకుండా సామాజిక సమస్యగా తీసుకుంటున్నాయి. ఎన్నికల హామీల్లో ఈ అంశం ఉండదు. దీనిపై అధికారుల దృష్టి పడదు. కుక్కల నియంత్రణలో ఉన్న మున్సిపల్ విభాగాలు తరచుగా సిబ్బంది, వాహనాలు, శానిటరీ వర్కర్లు లేక స్తంభించిపోతుంటాయి.

నిధుల కొరత

ప్రతి పట్టణం, నగరానికి ‘యానిమల్ బర్త్ కంట్రోల్ ’ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్రం, రాష్ట్రం నుంచి నిధులు రావాలి. కానీ ఎక్కువశాతం రాష్ట్రాలు వాటిని సరైన ప్రణాళిక ప్రకారం వినియోగించడం లేదు. స్టెరిలైజేషన్‌ కేంద్రాలు లేకపోవడం, వెటర్నరీ సర్జన్లు తక్కువగా ఉండటం వల్ల చర్యలు క్షీణించాయి.

చట్టపరమైన గందరగోళం

కుక్కలను చంపరాదు, తరలించరాదు అనే నిబంధనలు చాలా కఠినంగా ఉండటంతో, అధికారులు ఏమి చేయాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు మానవ హక్కులు, మరోవైపు జంతు హక్కుల మధ్య చట్టపరమైన ఇబ్బందుల్లో పరిపాలన యంత్రాంగం సతమతమవుతోంది.

పర్యవేక్షణ లేకపోవడం

ప్రతి మున్సిపాలిటీలో కుక్కల సంఖ్య, దాడుల వివరాలు, స్టెరిలైజేషన్‌ ప్రోగ్రామ్‌ స్థితి లాంటి అంశాలపై పరిమిత రికార్డులు మాత్రమే ఉంచుతున్నారు. సుప్రీంకోర్టు అడిగినప్పుడు మాత్రమే ఆ డేటా సేకరణ మొదలవుతుంది. దీని వలన దీర్ఘకాల ప్రణాళికలు ఉండవు.

ప్రజల్లో అవగాహనలేమి

వీధుల్లో నియంత్రణ లేకుండా ఆహారం వేయడం వల్ల కుక్కలు ఆ ప్రాంతాన్ని తమ ప్రదేశంగా ప్రకటించుకుంటాయి. దాడుల తీవ్రత పెరుగుతుంది. ప్రజల అవగాహన లేకపోవడం కూడా సమస్యను మరింత సంక్లిష్టం చేస్తోంది.

సమన్వయం లోపం

వెటర్నరీ , మున్సిపల్, పోలీస్‌ శాఖలు ఈ మూడు విభాగాలు కలసి పనిచేయాలి. కానీ వీటిలో సమన్వయం లేకపోవడం, పరస్పర బాధ్యతల తిప్పలు సమస్యను మరింత పెంచాయి.

సుప్రీం కోర్టు ముందు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు - Tholi Paluku