
సుప్రీం కోర్టులో మౌఖికంగా చెప్పడానికి వీల్లేదు:సీజేఐ
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్ తొలి రోజే కీలక పరిపాలనా సంస్కరణలను ప్రారంభించారు. ఇకపై అత్యవసర విచారణ కోసం కేసులను మౌఖికంగా మెన్షన్(నేరుగా న్యాయమూర్తికి చెప్పడం) చేయడానికి వీల్లేదని, అసాధారణ పరిస్థితుల్లో తప్పనిసరిగా రాతపూర్వక మెన్షనింగ్ స్లిప్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. మరణదండన, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అత్యంత కీలక అంశాలు ఉన్నప్పుడు మాత్రమే మౌఖిక మెన్షనింగ్‌ను అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు దినచర్యలో కొత్త విధానానికి నాంది పలికింది.
సుప్రీంకోర్టులో..
ఉదయం ప్రమాణం చేసిన అనంతరం జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. అక్కడ మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తదుపరి వారసత్వ కోర్ట్ రూం–1లో జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ అతుల్ చంద్రూ కర్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి నాయకత్వం వహించారు.సుప్రీంకోర్టు అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు విపిన్ నాయర్ నూతన సీజేఐకి స్వాగతం పలికారు. కోర్టు గదిలో ఒకరు ‘వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి సీజేఐగా ఎదిగినందుకు అభినందనలు’ అని చెప్పగా, సీజేఐ చిరునవ్వుతో ‘చండీగఢ్ నుంచి వచ్చిన యువ న్యాయవాదులను కూడా చూస్తున్నాను’ అని స్పందించారు.
మెన్షనింగ్‌పై స్పష్టత
‘అత్యవసరం అంటే నిజంగానే అత్యవసరమే’ న్యాయవాదులు అత్యవసరం పేరుతో తరచుగా మౌఖికంగా చెప్పే పద్ధతికి బ్రేక్ వేశారు. ఎవరైనా అత్యవసర మెన్షనింగ్ చేయాలనుకుంటే, స్లిప్ ఇవ్వాలి. రిజిస్ట్రీ పరిశీలించి నిజమైన అత్యవసరతా అంశం ఉందని భావిస్తేనే లిస్ట్ చేస్తాం. మరణదండన, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాల్లో మాత్రమే మౌఖిక మెన్షనింగ్‌ను అనుమతిస్తామన్నారు. అప్పటివరకూ కాంటీన్ కూల్చివేత కేసును అత్యవసరంగా మెన్షన్ చేసిన ఒక న్యాయవాదికి కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. గతంలో మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఈ మౌఖిక మెన్షనింగ్‌ను నిలిపివేయగా, అనంతరం బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయి మళ్లీ అనుమతించారు. ఇప్పుడు సూర్యకాంత్ తిరిగి దాన్ని రద్దు చేశారు.
జూనియర్ న్యాయవాదితో సరదాగా
ఒక కేసులో సీనియర్ న్యాయవాది రాకపోవడంతో జూనియర్ వాయిదా కోరగా, సీజేఐ చిరునవ్వుతో మీరు వాదిస్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వొచ్చు… ప్రయత్నించండి అని సరదాగా ప్రోత్సహించారు. అయితే జూనియర్ తన వద్ద సూచనలు లేవని తెలిపారు.
తొలిరోజే 17 కేసులు
మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభమైన విచారణల్లో సీజేఐ సూర్యకాంత్ రెండు గంటల్లోనే 17 కేసులు విన్నారు. విచారణ మొదలైన వెంటనే హిమాచల్ ప్రభుత్వం–ప్రైవేట్ సంస్థ మధ్య వివాదంపై తీర్పు ప్రకటించారు.
మణిపూర్ లో దర్యాప్తు కొనసాగుతోంది
మణిపూర్‌లో జరిగిన అనుమానిత ఎన్‌కౌంటర్ హత్యలపై కుటుంబాలు కోర్టు పర్యవేక్షించాలని కోరగా, సీజేఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్ఐఏ విచారణ స్థితిపై మాత్రమే నివేదిక కోరుతున్నామని పరిమిత నోటీసు జారీ చేశారు.
ప్రభుత్వ న్యాయసలహాదారు వివాదంలో
అలహాబాద్ హైకోర్టు తీర్పు సవాలు చేసిన కేసులో, ఒక జడ్జి భర్తను ప్రభుత్వ న్యాయ సలహాదారు పదవి నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ వ్యక్తిగత దూషణలు చేయవద్దు. కొన్ని విషయాలు పరిపాలనా మార్గంలోనే పరిష్కరించాలన్నారు. తరువాత పిటిషనర్ విజ్ఞప్తితో ఆ పిటిషన్ ఉపసంహరణకు కోర్టు అనుమతి ఇచ్చింది.
