Let's talk: editor@tmv.in
సుప్రీం కోర్టులో గురునానక్ జయంతి వేడుకలు

సుప్రీం కోర్టులో గురునానక్ జయంతి వేడుకలు

Pinjari Chand
5 నవంబర్, 2025

భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయి సహా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మంగళవారం గురునానక్ జయంతి సందర్బంగా సుప్రీం కోర్టు క్యాంటీన్‌లో నిర్వహించిన ‘లంగర్(సమూహ భోజనశాల)’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భవిష్యత్ సీజేఐగా నియమితులైన న్యాయమూర్తి సూర్యకాంత్ కూడా హాజరయ్యారు. న్యాయమూర్తులు, సిబ్బంది అందరూ కలిసి ఆధ్యాత్మికత,సేవా భావంతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ‘గురుపురబ్’గా పిలిచే గురునానక్ జయంతి, సిక్కు మత స్థాపకుడు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి నాడు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా గురుద్వారాల్లో పఠనలు, భజనలు, లంగర్‌లు నిర్వహిస్తూ భక్తులు ఈ ఉత్సవాన్ని ఆరాధనతో జరుపుకుంటారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని భారతదేశం నుంచి 1,796 మంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్‌లోని పుణ్యక్షేత్రాలకు నవంబర్ 5న బయలుదేరనున్నారు. వీరు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా ప్రవేశించి పలు చారిత్రాత్మక గురుద్వారాల్లో నమస్కారాలు చేయనున్నారు.

యాత్రకు అనుమతులు మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి యాత్రికులు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు భక్తులు వీసా ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కూడా సూచించారు. ఇక పాకిస్థాన్ హైకమిషన్ తాజాగా ప్రకటించిన ప్రకారం, 2,100కిపైగా వీసాలు భారతీయ సిక్కు యాత్రికులకు జారీ చేసినట్టు తెలిపింది. ఈ యాత్ర నవంబర్ 4 నుంచి 13 వరకు పాకిస్థాన్‌లో జరగనున్న ‘బాబా గురునానక్ దేవ్ జీ జయంతి లో భాగమని పేర్కొంది.

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా

గురునానక్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇది సిక్కు మతంలోనే కాకుండా, భారతదేశంలోని వివిధ మతాల ప్రజలు కూడా గౌరవంగా జరుపుకునే ఒక జాతీయ ఆధ్యాత్మిక వేడుక. గతంలో సుప్రీం కోర్టు ప్రాంగణంలోనూ గురునానక్ జయంతి సందర్భంగా లంగర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోర్టు సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి సేవా కార్యక్రమాలు చేస్తారు. లంగర్‌లో సిక్కు సంప్రదాయ భోజనమైన రోటీలు, దాల్, కూరలు మొదలైనవి వడ్డిస్తారు. గురుబాణీ (పవిత్ర గీతాలు) పఠనం, ప్రార్థనలు కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం సుప్రీం కోర్టు, హైకోర్టులు, అలాగే ప్రభుత్వ సంస్థలు ఈ వేడుకకు గుర్తుగా చిన్నచిన్న లంగర్‌లు లేదా భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే కొత్త సీజేఐగా నియమితులైన న్యాయమూర్తి సూర్యకాంత్ కూడా పాల్గొనడం వల్ల ఈ వేడుకకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.