Let's talk: editor@tmv.in
సుప్రీంలో ‘వాంగ్ చుక్’​ కేసు విచారణ

సుప్రీంలో ‘వాంగ్ చుక్’​ కేసు విచారణ

Pinjari Chand
7 అక్టోబర్, 2025

వాతావరణ కార్యకర్త, లఢఖ్​ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఉద్యమకారుడైన సోనమ్​ వాంగ్ చుక్ అరెస్ట్ పై సుప్రీం కోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా చట్టం కింద సోనమ్ ను అరెస్ట్ చేయడాన్ని ఆయన భార్య గీతాంజలి అంగ్మో కోర్టులో సవాల్​ చేశారు. అలాగే సుమారు వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్​ పూర్ జైలుకు తరలించడంపై కూడా ఆమె కోర్టులో పిటిషన్​ వేశారు. కనీసం ఆయన అరెస్ట్​ గురించి తనకు తెలపలేదని ఆమె కోర్టులో వాపోయారు. దీన్ని విచారణకు స్వీకరించిన జస్టిస్ అరవింద్​ కుమార్​, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, రాజస్థాన్​, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేసును తదుపరి విచారణను అక్టోబర్​ 14 కు వాయిదా వేసింది.

సిబాల్​, అడ్వకేట్ జనరల్​ మధ్య వాదనలు

సోనమ్ వాంగ్ చుక్​ తరపున సీనియర్ న్యాయవాది కపిల్​ సిబల్, మరో న్యాయవాది వివేక్​ టంఖా​ వాదించారు. వాంగ్ చుక్ అరెస్ట్ కు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కారణాలు చూపలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం ఏ వ్యక్తిని తగిన కారణాలు లేకుండా నిర్భందించడం తగదన్నారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్​ తుషార్​ మెహతా సమాధానమిస్తూ ఇప్పటికే వాంగ్​ చుక్ అరెస్ట్​ కు గల కారణాలు వివరించామని, ఆయన భార్యకు వివరించాల్సిన అవసరం చట్టపరంగా లేదన్నారు. అయినప్పటికీ సాధ్యసాధ్యాలు పరిశీలించి వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదని అందుకుగాను ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చి, తాత్కాలిక ఉపశమనం కలిగించాలని సిబల్​ కోర్టును కోరారు. అరెస్ట్​ సమయంలో ఆయనకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించామని, ఆయన ఎలాంటి మందులు తీసుకోవడం లేదని ప్రకటించారని తుషార్ మెహతా వివరించారు. ​ఆరోగ్యపరంగా ఏమైనా మందులు అవసరమైతే వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. కేవలం భావోద్వేగ వాతావారణాన్ని సృష్టించడానికే వాంగ్​ చుక్ తరపున ప్రయత్నిస్తున్నారని ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆయనకు లేవని తెలిపారు. భర్తను కలవడానికి అవకాశం ఇవ్వాలని సిబల్​ ధర్మాసనాన్ని కోరారు. అయితే అందుకు సంబంధించి పిటిషన్ ఇవ్వాలని పరిశీలిస్తామని మెహతా తెలిపారు. లఢఖ్​ లో చెలరేగిన ఆందోళనలకు వాంగ్ చుక్ ను బాధ్యుడిని చేస్తూ సెప్టెంబర్ 26 న ఆయనను అరెస్ట్ చేసి రాజస్థాన్​ లోని జోధ్​ పూర్​ సెంట్రల్​ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

సుప్రీంలో ‘వాంగ్ చుక్’​ కేసు విచారణ - Tholi Paluku