
సుప్రీంకోర్టులో సీజేఐపై దాడికి యత్నం
సుప్రీంకోర్టులో సోమవారం చోటుచేసుకున్న సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఒక న్యాయవాది రాకేష్ కుమార్ దాడి చేయడానికి యత్నించాడు. ఈ దృశ్యం గమనించిన తోటి లాయర్లు వెంటనే స్పందించి, అతన్ని ఆపి పోలీసులకు అప్పగించారు. ఇటీవలే ఖజురాహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ బీఆర్ గవాయ్ తిరస్కరించారు.
అయితే ఆ తీర్పు సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీం కోర్టులో మరో కేసు విచారణ జరుగుతుండగా ఒక లాయర్ అకస్మాత్తుగా ప్రధాన న్యాయమూర్తిపై షూ విసరడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు ఆ షూ సీజేఐ బెంచ్ వద్దకు చేరక ముందే నేలపై పడిపోయింది. అదే సమయంలో ఆ లాయర్ "సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం మౌనం వహించదు" అంటూ నినాదాలు చేశాడు.అయితే అక్కడి ఇతర లాయర్లు వెంటనే అతన్ని అడ్డుకుని కోర్టు సిబ్బందికి అప్పగించారు.ఈ ఘటనతో క్షణం పాటు కోర్టులో ఉద్రిక్తత నెలకొన్నా,జస్టిస్ బీఆర్ గవాయ్ చాలా ధైర్యంగా వ్యవహరించారు.
విచారించిన పోలీసులు
ఈ సంఘటన తరువాత సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీపోలీసులు రాకేష్ కిషోర్‌ను మూడు గంటలపాటు విచారించి విడుదల చేశారు. విచారణలో అతడు “సనాతన్ ధర్మాన్ని అవమానించినట్లు” అనిపించడం వల్లే ఆగ్రహంతో ఆ చర్య చేశానని తెలిపినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఒక కేసులో ఖజురాహో ఆలయానికి సంబంధించిన దైవ ప్రతిమ పునఃస్థాపన కేసు విచారణ సమయంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలు కొందరికి అభ్యంతరకరంగా అనిపించాయని పోలీసులకు తెలిపాడు.
రాకేష్ సస్సెండ్
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించి న్యాయవాది రాకేష్ ను సస్పెండ్ చేసింది. సీజేఐ గవాయి మాత్రం ఈ ఘటనపై ప్రశాంతంగా స్పందిస్తూ, “ఇలాంటి సంఘటనలు తనను ప్రభావితం చేయవన్నారు. తన కర్తవ్యం చేయడం కొనసాగిస్తాను” అన్నారు
సీజేఐపై దాడిని ఖండించిన నేతలు
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్‌పై జరిగిన దాడి ఘటనను ప్రధానమంత్రి తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన ప్రతి భారతీయునికీ ఆగ్రహాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు సమాజంలో స్థానం లేదన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ గవాయ్ చూపిన ప్రశాంతత, న్యాయం పట్ల ఆయన అంకితభావాన్ని, రాజ్యాంగ విలువలను బలపరిచే ఆయన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధాని అభినందించారు. అదే విధంగా కాంగ్రెస్ సీనీయర్ నేత సోనియాగాంధీ ఈ ఘటనపై స్పందిస్తూ ఇది రాజ్యాంగంపై దాడిగా ఆమె అభివర్ణించారు. ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ స్పందిస్తూ ఇది భారతదేశానికి అవమానంటూ వ్యాఖ్యానించారు. వీరితో పాటు బార్ కౌన్సిల్ న్యాయవాదులు, ఇతర ప్రముఖులు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
