
సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ రాష్ట్ర ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి టీ. ప్రభాకర్ రావుకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అతను పూర్తిగా విరిగిపడే వరకు జైలులోనే ఉంచాలనుకుంటున్నారా? అంటూ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును శుక్రవారం విచారించింది. విచారణ ప్రారంభంలోనే, ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను (ఇంటిరిమ్ బెయిల్) ఖరారు చేసే దిశగా కోర్టు మొగ్గుచూపుతున్నట్లు తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసులో కీలకమైన న్యాయపరమైన ప్రశ్నలు ఉన్నాయని, ముఖ్యంగా పరారీలో ఉన్నట్లు ప్రకటించబడిన వ్యక్తి, విదేశాల్లో నివసిస్తున్న సమయంలో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అనే అంశాన్ని కోర్టు పరిశీలించాలని ఆయన వాదించారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం, మీ వైఖరి చూస్తుంటే అతను పూర్తిగా కుంగిపోయే వరకు జైలులోనే ఉండాలని మీరు కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. మేము ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను దుర్వినియోగం చేసుకునేందుకు మేము అనుమతించం అంటూ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిందితుడికి పూర్తిస్థాయి స్వేచ్ఛ లభించినట్లు కాదని, అవసరమైతే రాష్ట్ర పోలీసులు విచారణ కోసం అతన్ని పిలవవచ్చని కూడా కోర్టు పేర్కొంది.
డిసెంబర్ 11న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆర్టికల్ 142 ప్రకారం విచారణకు సహాయపడే ఉద్దేశంతోనేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసును తుది విచారణకు మార్చి 10న చేపడతామని తెలిపిన సుప్రీంకోర్టు, అప్పటివరకు ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగించింది.
ఇదిలా ఉండగా, గత ఏడాది డిసెంబర్ 19న ప్రభాకర్ రావు పోలీసు కస్టడీని డిసెంబర్ 25 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. డిసెంబర్ 26న విచారణ పూర్తయ్యాక ఆయనను విడుదల చేయాలని, తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు డిసెంబర్ 12న ప్రభాకర్ రావు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారుల ముందు లొంగిపోయారు.
అయితే, కోర్టు ఆదేశాలున్నప్పటికీ ప్రభాకర్ రావు తన ఐక్లౌడ్ ఖాతాల వివరాలను ఇప్పటికీ అందజేయలేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు, మే 29న సుప్రీంకోర్టు ఆయనకు బలవంతపు చర్యల నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ, పాస్‌పోర్టు అందుకున్న మూడు రోజుల్లో భారత్‌కు తిరిగి రావాలని అండర్‌టేకింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభాకర్ రావు, తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 22న హైదరాబాద్ కోర్టు ఈ కేసులో ఆయనపై ప్రోక్లమేషన్ ఆర్డర్ జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. వారిలో సస్పెండ్ అయిన ఎస్‌ఐబీ డీఎస్పీ కూడా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసి, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తొలగించారనే ఆరోపణలపై వీరిని హైదరాబాద్ పోలీసులు మార్చి 2024 నుంచి అరెస్టు చేశారు. అనంతరం వారికి బెయిల్ లభించింది.
పోలీసుల ప్రకారం, ఎస్‌ఐబీ వనరులను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసి, వివిధ వర్గాలకు చెందిన పౌరులను అనుమతి లేకుండా నిఘాలో పెట్టడం, వారి వ్యక్తిగత వివరాలతో ప్రొఫైళ్లు తయారు చేయడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. అంతేకాదు, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తమ నేరాలకు సంబంధించిన రికార్డులు, ఆధారాలను నాశనం చేయడానికి కుట్ర పన్నారన్నది పోలీసుల ప్రధాన వాదన. ఈ నేపథ్యంలో, ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తుది నిర్ణయం కోసం మార్చి 10 వరకు ఎదురుచూడాల్సి ఉంది.
