
సునేత్రా పవార్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలపం: సుప్రియా సూలే
మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉపఎన్నికలో ఉప ముఖ్యమంత్రి సునేత్రాపవర్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ అభ్యర్థిని నిలపదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. బారామతి ఉపఎన్నికలో మా పార్టీ పోటీ చేయదు. సునేత్రా వహినికి (అత్తయ్య కోడలు) వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టమని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల భారత ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రలోని బారామతి(పుణే జిల్లా), రాహురి (అహిల్యానగర్ జిల్లా) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఉపఎన్నికలు జరగనున్నాయి.
బారామతి స్థానానికి ఉపఎన్నిక మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ మరణంతో ఖాళీ అయింది. అలాగే రాహురి అసెంబ్లీ స్థానం బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కర్డిలే మృతి కారణంగా ఖాళీ అయ్యింది. బారామతి ఉపఎన్నికలో సునేత్రా పవార్ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. రాహురి స్థానంపై ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) భాగస్వాములు చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటారని సుప్రియా సూలే తెలిపారు.
గత ఎన్నికల్లో సుప్రియా సూలే విజయం
2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి పోటీ చేసిన సుప్రియా సూలే, తన మేనల్లుడు అజిత్ పవార్ భార్య అయిన సునేత్రా పవార్‌ను ఓడించి విజయం సాధించారు. ఆ ఎన్నికల తరువాత సునేత్రా పవార్ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
విమాన ప్రమాదంపై పారదర్శక విచారణ కోరిన సూలే
ఈ ఏడాది జనవరి 28న పుణే సమీపంలోని బారామతి విమానాశ్రయం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించారు. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరపాలని తమ పార్టీ కోరుతోందని సుప్రియా సూలే తెలిపారు.
ఎల్‌పీజీ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా హోటల్ రంగం సహా అనేక వ్యాపారాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎల్‌పీజీ సమస్యను ప్రభుత్వం దాచిపెట్టకుండా పారదర్శకంగా చర్చించాలని ఆమె పేర్కొన్నారు.
