
సుజుకీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ-యాక్సెస్’ బుకింగ్స్ ప్రారంభం
ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకీ ఈ-యాక్సెస్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. దీంతో భారత మార్కెట్ నుంచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో సుజుకీ గ్లోబల్ ఎంట్రీ ఇచ్చినట్టైంది. ఈ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న సుజుకీ అధికారిక షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ-యాక్సెస్‌తో పాటు సుజుకీ కొత్తగా డ్యూయల్-టోన్ కలర్‌ను కూడా పరిచయం చేసింది. ‘మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ/ మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే’ అనే ఈ కొత్త రంగుతో మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లు వినియోగదారులకు లభించనున్నాయి.
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచీ ఉమెడా మాట్లాడుతూ, ఈ-యాక్సెస్ సుజుకీకి తొలి గ్లోబల్ స్ట్రాటజిక్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనమని తెలిపారు. దీన్ని దీర్ఘకాల బ్యాటరీ లైఫ్, సాఫీ యాక్సిలరేషన్, తేలికపాటి హ్యాండ్లింగ్, నాణ్యమైన ఫినిష్‌తో రూపొందించామని చెప్పారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేని, అత్యంత సంతృప్తికరమైన అనుభూతిని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.
బ్యాటరీ, పనితీరు
ఈ స్కూటర్‌లో అత్యంత ఆధునికమైన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని ఉపయోగించారు. సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉండే ఎన్‌ఎంసీ బ్యాటరీలతో పోలిస్తే, ఇది నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతుందని సుజుకీ సంస్థ చెబుతోంది. ఇందులో అమర్చిన 4.1 కిలోవాట్ శక్తివంతమైన మోటార్ వల్ల స్కూటర్ వేగంగా దూసుకుపోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే, బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పటికీ వేగం తగ్గకుండా స్థిరమైన పనితీరును (15 ఎన్ఎం టార్క్) అందిస్తుంది, దీనివల్ల డ్రైవింగ్ అనుభవం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
రైడింగ్ మోడ్స్, ఫీచర్లు
వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ స్కూటర్‌లో మూడు రకాల రైడింగ్ మోడ్స్‌ను అందించారు. ఎక్కువ మైలేజీ కోసం 'ఈకో', సాఫీగా ప్రయాణించడానికి 'రైడ్-ఏ', వేగంగా వెళ్లడం కోసం 'రైడ్-బి' మోడ్‌లను ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు స్కూటర్‌ను సులభంగా వెనక్కి తీయడానికి 'రివర్స్ మోడ్' సదుపాయం కూడా ఉంది. ఇక బ్రేక్ వేసినప్పుడు వృథా అయ్యే శక్తిని తిరిగి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఉపయోగపడే 'రీజెనరేటివ్ బ్రేకింగ్' వ్యవస్థను ఇందులో అమర్చారు. స్కూటర్ బాడీని తక్కువ బరువు ఉండేలా, ఫ్రేమ్‌లోనే అల్యూమినియం బ్యాటరీ కేస్‌ను అమర్చడం వల్ల ప్రయాణంలో మంచి స్థిరత్వం, సులభమైన నియంత్రణ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.
తక్కువ మెయింటెనెన్స్.. ఎక్కువ భరోసా!
ఈ స్కూటర్ నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటం వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తుంది. ఇందులో అమర్చిన 'డ్రైవ్ బెల్ట్' సుమారు 7 ఏళ్లు లేదా 70,000 కిలోమీటర్ల వరకు పని చేస్తుంది, కాబట్టి తరచూ మార్చాల్సిన అవసరం లేకుండానే ఎక్కువ కాలం వాడుకోవచ్చు. దీనికి అదనంగా స్టైలిష్ ఎల్‌ఈడీ లైట్లు, రెండు రంగుల అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్కూటర్ బాడీని దృఢమైన అల్యూమినియంతో తయారు చేయడం వల్ల బరువు తక్కువగా ఉండి, ప్రయాణంలో మంచి బ్యాలెన్స్, స్థిరత్వాన్ని అందిస్తుంది.
ధర, ఆఫర్లు
ఢిల్లీలో ఈ స్కూటర్ ధరను రూ.1,88,490 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి సుజుకి సంస్థ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా 7 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు ఉచితంగా పొడిగించిన వారంటీని అందిస్తోంది. అంతేకాకుండా, స్కూటర్ కొన్న మూడు ఏళ్ల తర్వాత దాని విలువలో 60 శాతం మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా 'బై-బ్యాక్' గ్యారెంటీని ఇస్తుండటం విశేషం. ఇక పాత సుజుకి కస్టమర్లకు రూ. 10,000 వరకు లాయల్టీ బోనస్, కొత్తగా సుజుకి కుటుంబంలోకి చేరేవారికి రూ.7,000 వెల్కమ్ బోనస్‌తో పాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
చార్జింగ్ ఎక్కడ చేసుకోవాలి?
సుజుకికి దేశవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లు ఉన్నాయి. ప్రతి చోటా ఏసీ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. వీటిలో సుమారు 240 కంటే ఎక్కువ సెంటర్లలో అత్యంత వేగంగా ఛార్జ్ చేసే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం డీలర్ల దగ్గర బుక్ చేసుకునే వీలుండగా, త్వరలోనే ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఇది అందుబాటులోకి రానుంది.
