
సుక్మాలో 29 మంది నక్సలైట్ల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బుధవారం 29 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు చెందిన ఫ్రంటల్ విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న వీరు, పోలీస్, సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాసం – సమాజంలో పునఃసమావేశం లక్ష్యంగా అమలు చేస్తున్న ‘పూనా మార్గం’ కార్యక్రమం ప్రభావంతోనే నక్సలైట్లు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిలో గోగుండా ప్రాంతంలో మావోయిస్టుల ఫ్రంటల్ విభాగమైన దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘ్ (డీఏకేఎంఎస్) నాయకుడు పొడియం బుద్రా కూడా ఉన్నాడు. ఇతనిపై రూ.2 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా నక్సలైట్లు డీఏకేఎంఎస్, మిలీషియా, జనతన సర్కార్ విభాగాలకు చెందినవారని పేర్కొన్నారు. గోగుండా ప్రాంతంలో ఇటీవల భద్రతా శిబిరం ఏర్పాటు చేయడం నక్సలైట్ల లొంగుబాటుకు కీలకంగా మారిందని ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు. శిబిరం ఏర్పాటుతో నక్సల్ వ్యతిరేక చర్యలు ముమ్మరం కావడం, నిరంతర సోదాలు నిర్వహించడం వల్ల మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు.
అంతకుముందు దట్టమైన అడవులు, క్లిష్ట భౌగోళిక పరిస్థితుల కారణంగా మావోయిస్టుల దర్భా డివిజన్‌కు గోగుండా ప్రాంతం కీలక స్థావరంగా ఉండేదని, అయితే భద్రతా శిబిరంతో ఆ ప్రాంతంలోని నక్సల్ ప్రభావాన్ని పూర్తిగా కట్టడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ లొంగుబాటుతో దర్భా డివిజన్‌లో మావోయిస్టుల మద్దతు వ్యవస్థ కూడా బలహీనపడిందని ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టు సంస్థకు చెందిన వారు హింస మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలోకి రావాలని, వారికి భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవితం కల్పిస్తామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే నెల 8న దంతేవాడ జిల్లాలో 63 మంది నక్సలైట్లు లొంగిపోగా, జనవరి 7న సుక్మాలో మరో 26 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 2025 సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,500 మందికిపైగా నక్సలైట్లు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. దేశం నుంచి నక్సలిజాన్ని ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
