Let's talk: editor@tmv.in
సీసీఐ స్నూకర్ ఛాంపియన్‌గా దిగ్విజయ్ కాడియాన్

సీసీఐ స్నూకర్ ఛాంపియన్‌గా దిగ్విజయ్ కాడియాన్

Shaik Mohammad Shaffee
24 మార్చి, 2026

ముంబై వేదికగా జరిగిన 'సీసీఐ స్నూకర్ క్లాసిక్ 2026' టోర్నమెంట్‌లో పంజాబ్ యువ కెరటం దిగ్విజయ్ కాడియాన్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో దిగ్విజయ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ ఆటగాడు, పీఎస్‌‌పీబీ ప్రతినిధి బ్రిజేష్ దమానీపై 7-1 ఫ్రేమ్‌ల తేడాతో ఘనవిజయం సాధించి, తన మొట్టమొదటి సీనియర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో దిగ్విజయ్ రూ.3.5 లక్షల నగదు బహుమతిని గెలుచుకోగా, రన్నరప్‌గా నిలిచిన బ్రిజేష్ రూ.1.75 లక్షలు అందుకున్నాడు.

ఆరంభం నుంచీ దూకుడే

బాంబే జింఖానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల దిగ్విజయ్, ఫైనల్లో ఆరంభం నుంచే పట్టు బిగించాడు. తొలి ఫ్రేమ్‌ను 55-59తో స్వల్ప తేడాతో కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రెండో ఫ్రేమ్‌లో 88 పాయింట్ల అద్భుత బ్రేక్‌తో స్కోరును సమం చేసిన దిగ్విజయ్, ఆపై వరుసగా 67, 91, 37 పాయింట్ల బ్రేక్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. చివరకు 55-59, 88-17, 77-1, 83-73, 76-36, 92-0, 62-53, 95-0 స్కోరుతో మ్యాచ్‌ను ముగించి ఛాంపియన్‌గా నిలిచాడు.

బ్రిజేష్‌ పోరాటం వృథా

2018 ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బ్రిజేష్ దమానీకి ఈ మ్యాచ్‌లో అవకాశాలు దక్కినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. కొన్ని కీలక సమయాల్లో రెగ్యులేషన్ పాట్‌లను మిస్ చేయడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అంతకుముందు శనివారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో బ్రిజేష్ అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాస్ గుప్తాపై 1-4తో వెనుకబడిన స్థితి నుంచి పుంజుకుని 6-5తో విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. అయితే ఫైనల్లో మాత్రం దిగ్విజయ్ ధాటికి నిలవలేకపోయాడు.

రికార్డు బ్రేక్‌తో పరాస్‌కు ఊరట

సెమీఫైనలిస్టులు షాయాన్ రజ్మీ, పరాస్ గుప్తాలకు తలో రూ.80,000 నగదు బహుమతి లభించింది. టోర్నీలో ఓడిపోయినప్పటికీ పరాస్ గుప్తా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సెమీఫైనల్ నాలుగో ఫ్రేమ్‌లో అతను సాధించిన 115 పాయింట్ల బ్రేక్, ఈ టోర్నీలోనే అత్యధికం. ఈ ఘనతకు గుర్తింపుగా పరాస్‌కు రూ.25,000 ప్రత్యేక బహుమతిని అందజేశారు. కాగా ఈ టోర్నీలో దిగ్విజయ్ చూపిన ఏకాగ్రత, షాట్ సెలెక్షన్ అభిమానులను విశేషంగా అలరించాయి.