
సీషెల్స్ పర్యటనకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం సీషెల్స్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన సీషెల్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా డాక్టర్ హెర్మినీకి భారతదేశం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు.
ఇరు దేశాల మధ్య సన్నిహిత, దీర్ఘకాలిక సంబంధాలను ఉప రాష్ట్రపతి పునరుద్ఘాటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సీషెల్స్‌లో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల్లో 52.7 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు వేవెల్ రామకళావన్‌ను ఓడించి గెలుపొందిన హెర్మినీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
డాక్టర్ పాట్రిక్ హెర్మినీ నేపథ్యం
యూనైటెడ్ సీషెల్స్ పార్టీకి చెందిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీ సీషెల్స్ రాజకీయాల్లో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆయన 1993 నుండి జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశారు. 1998 నుండి 2007 వరకు ప్రభుత్వ వ్యవహారాల నాయకుడిగా పనిచేశారు. 2007 నుండి 2016 వరకు జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా సేవలందించారు. 2017 నుండి 2020 వరకు డ్రగ్స్ దుర్వినియోగం నివారణ, పునరావాసానికి సంబంధించిన స్టేట్ సెక్రెటరీగా పనిచేసి, జాతీయ డ్రగ్ నివారణ కార్యక్రమాలపై దృష్టి సారించారు.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం
ఉపరాష్ట్రపతి పర్యటన భారతదేశం, సీషెల్స్ మధ్య 1976లో స్థాపించబడిన సుదీర్ఘ దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. భారతదేశం విక్టోరియాలో తన రెసిడెంట్ హైకమిషన్‌ను నిర్వహిస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టులు, సముద్ర భద్రత, ప్రాంతీయ సహకారంలో సీషెల్స్‌కు మద్దతు ఇస్తోంది. ఈ పర్యటన హిందూ మహాసముద్ర ప్రాంతం పట్ల భారతదేశ నిబద్ధతను, సముద్ర భద్రత, సముద్రపు దొంగల నిరోధక కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సీషెల్స్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతోంది.
