Let's talk: editor@tmv.in
సీషెల్స్‌కు భారత్ ఆపన్న హస్తం

సీషెల్స్‌కు భారత్ ఆపన్న హస్తం

Shaik Mohammad Shaffee
9 ఏప్రిల్, 2026

పొరుగు దేశాలకు ప్రాధాన్యమిచ్చే విధానంలో భాగంగా భారత్ మరో కీలక అడుగు వేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ద్వీప దేశం సీషెల్స్‌కు 250 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను భారత్ పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. సీషెల్స్‌ అభివృద్ధి కోసం భారత్ ప్రకటించిన 175 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.1,600 కోట్లు) ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఈ సహాయాన్ని అందజేస్తున్నారు. "మొదటి విడతగా 250 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపాం.. ప్యాకేజీలో భాగంగా మరిన్ని సహాయక చర్యలు కొనసాగుతాయి" అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

మైత్రీ బంధం.. అభివృద్ధికి బాట

ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుండి 10 వరకు సీషెల్స్‌ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో భాగంగా 125 మిలియన్ డాలర్లను 'రూపాయి' ఆధారిత రుణ సదుపాయం కింద, మరో 50 మిలియన్ డాలర్లను గ్రాంట్ల రూపంలో భారత్ అందజేయనుంది. ఈ నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పౌర, రక్షణ రంగ అధికారుల సామర్థ్య పెంపు, సముద్ర భద్రత వంటి కీలక ప్రాజెక్టుల కోసం వినియోగించనున్నారు.

రక్షణ, భద్రతపై ప్రత్యేక దృష్టి

సీషెల్స్‌ జాతీయ అభివృద్ధి అజెండాలో భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ముఖ్యంగా సముద్ర భద్రత, రక్షణ రంగం, పర్యావరణ సుస్థిరత, సమ్మిళిత వృద్ధికి భారత్ ప్రాధాన్యతనిస్తోంది. గతంలోనూ భారత్ అందించిన గ్రాంట్లు, సామర్థ్య పెంపు శిక్షణలు తమ దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని అధ్యక్షుడు హెర్మినీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ప్రజా పంపిణీ వ్యవస్థను, అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని నేతలు నిర్ణయించారు.

డిజిటల్ విప్లవంలో భారత్ తోడ్పాటు

భారతదేశం సాధించిన డిజిటల్ పురోగతి గ్లోబల్ సౌత్ దేశాలకు ఆదర్శమని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. సీషెల్స్‌లో పాలనను డిజిటలైజ్ చేయడంలో భారత్ పూర్తి సహకారాన్ని అందించనుంది. ముఖ్యంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆ దేశ అవసరాలకు అనుగుణంగా నిర్మించేందుకు భారత్ అంగీకరించింది. దీనివల్ల సీషెల్స్‌ పౌరులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

సీషెల్స్‌కు భారత్ ఆపన్న హస్తం - Tholi Paluku