
సీమ్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల
భారతదేశంలోని అత్యుత్తమ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ/ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు శుభవార్త. కామన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీమ్యాట్) 2026 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన 1000కి పైగా బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ/ పీజీడీఎం వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరడానికి సీమ్యాట్ స్కోరు కీలకం. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ నవంబర్ 18. దరఖాస్తుల్లో సవరణలకు నవంబర్ 20 నుంచి 22 వరకు అవకాశం కల్పిస్తారు. సాధారణంగా జనవరి 2026 మూడో వారంలో అడ్మిట్ కార్డులను విడుదల చేసి, అదే నెల చివరి వారంలో పరీక్షను నిర్వహిస్తారు.
ఇక విద్యార్హతల విషయానికి వస్తే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు. జనరల్ పురుషులకు రూ.2,500, మహిళలకు రూ.1,250, జనరల్- ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్) పురుషులకు రూ.1,250, మహిళలకు రూ.1,250 దరఖాస్తు ఫీజుగా ఉంది.
ఇక పరీక్ష విషయానికి వస్తే సీమ్యాట్‌లో 400 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక్కో సెక్షన్ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, ఇన్నొవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 3 గంటలు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక్కో మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌లో ఉంటుంది.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలుగా హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ నగరాలు ఉండగా, ఏపీలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు ఉన్నాయి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ cmat.nta.nic.inను సందర్శించండి.
సీమ్యాట్ గురించి..
సీమ్యాట్ స్కోరు ద్వారా దేశంలోని ప్రముఖ ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లతో పాటు యూనివర్సిటీల్లో రెండేళ్ల ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. సీమ్యాట్ ఎంబీఏ కోర్సు ఫీజులు సాధారణంగా రూ.లక్ష నుంచి మొదలవుతాయి. టాప్ బిజినెస్ స్కూళ్లు/ ఐఐఎంలలో అయితే కోర్సు ఫీజు రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది (రెండేళ్లకు).
ఈ కాలేజీల్లో ఎంబీఏ/పీజీడీఎం పూర్తి చేసిన విద్యార్థులకు అనేక ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ఉద్యోగాలు ఉంటాయి. ఉదాహరణకు ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ చేసినట్లయితే ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, పోర్ట్‌ఫోలియో మేనేజర్, రిస్క్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. సాధారణంగా ఈ స్థాయిలో ఉన్న వారికి సగటు వార్షిక వేతనం రూ.5 లక్షల నుండి రూ.15 లక్షల వరకు ఉంటుంది. టాప్ కాలేజీల్లో ప్లేస్‌మెంట్లు రూ.25 లక్షల వరకు కూడా ఉండవచ్చు.
