
సీబీఐ ముందుకు టీవీకే నేత విజయ్
కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి, నటుడు, తమిళ వెట్రి కళగం రాజకీయ నేత జోసెఫ్ విజయ్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోమవారం విస్తృతంగా విచారించింది. ఈ విచారణలో ముఖ్యంగా కార్యక్రమంలో జరిగిన ఆలస్యాలు, సమూహా నియంత్రణలో లోపాలు, కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు వంటి అంశాలపై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది అక్టోబర్‌లో ఈ కేసు దర్యాప్తును తమిళనాడు పోలీసుల నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి కరూర్‌లో జరిగిన రాజకీయ కార్యక్రమంలో తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులను సీబీఐ పరిశీలిస్తోంది.
విజయ్ పై ప్రశ్నల వర్షం
ఈ దర్యాప్తులో ప్రధాన అంశంగా ఏడు గంటలు ర్యాలీకి ఆలస్యంగా రావడంపై విచారణ జరుగుతోంది. కార్యక్రమం ప్రారంభానికి నిర్ణయించిన సమయం, విజయ్ వాస్తవంగా అక్కడికి చేరుకున్న సమయం మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఆలస్యం వల్ల రద్దీ విపరీతంగా పెరిగి పరిస్థితి అదుపు తప్పిందా? అనే కోణంలో సీబీఐ ప్రశ్నిస్తోంది. అలాగే, అక్కడి పార్టీ కార్యకర్తలు స్థానిక పోలీసులు, జిల్లా పరిపాలనతో సమన్వయం చేసుకున్నారా? అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మొదట సుమారు 10 వేల మందిగా అంచనా వేసినా, తర్వాత 30 వేల మందికి చేరిందని సమాచారం. ఈ సమయంలో విజయ్, ఆయన పార్టీ కార్యకర్తల కదలికల్లో జరిగిన ఆలస్యం, జన సందోహం పై ఎంత ప్రభావం చూపాయన్నదానిపై విచారణ సాగుతోంది. కార్యక్రమానికి సంబంధించి తీసుకున్న అనుమతులు, కరూర్‌లో ఈ సభ నిర్వహించాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు, విజయ్‌కు ఈ కార్యక్రమం గురించి ఎప్పుడు సమాచారం ఇచ్చారు వంటి అంశాలపై సీబీఐ పత్రాలను పరిశీలిస్తోంది. పార్టీ లోపలి సంస్థాగత నిర్మాణం, ప్రణాళిక, అమలు బాధ్యతలు ఎవరివి అనే దానిపై కూడా విచారణ జరుగుతోంది. జిల్లా పరిపాలనతో కలిసి ముందస్తు ప్రమాద అంచనా (రిస్క్ అసెస్‌మెంట్) చేపట్టారా? తాగునీటి సౌకర్యాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు వంటి మౌలిక ఏర్పాట్లు ఉన్నాయా? అనే విషయాలపై కూడా సీబీఐ ప్రశ్నలు సంధిస్తోంది.
విజయ్ ఉపయోగించిన కారవాన్ వాహనం జన సందోహం మధ్య ఎలా ప్రయాణించిందన్న అంశం కూడా దర్యాప్తులో ఉంది. ఈ సమయంలో స్థానిక పోలీసులతో సరైన సమన్వయం జరిగిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే, తొక్కిసలాట ఘటన గురించి విజయ్‌కు ఎప్పుడు తెలిసింది, ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమం ఏమిటి అనే అంశాలపై కూడా సీబీఐ దృష్టి సారించింది. విజయ్ అక్కడికి వచ్చిన, వెళ్లిపోయిన ఖచ్చితమైన సమయాలపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఇదివరకు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, గత ఏడాది సెప్టెంబర్‌లో పార్టీ ప్రచార కార్యక్రమంలో జరిగిన ఈ ఘటనలో 41 మంది మృతి చెందడంతో, సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు న్యూఢిల్లీకి వచ్చారు.
ఇప్పటికే పలువురి విచారణ
భారతీయ నాగరిక భద్రతా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 179 కింద విజయ్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు జనవరి 6 తేదీతో జారీ కాగా, ఈ నెల ప్రారంభంలో అందజేశారు. టీవీకే వర్గాల ప్రకారం, విజయ్ చెన్నై నుంచి చార్టర్డ్ విమానంలో న్యూఢిల్లీకి చేరుకొని, ఈరోజు సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరించనున్నారు.
ఈ ఘటనపై విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో భాగంగా సీబీఐ ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్ నేతలను న్యూఢిల్లీలో విచారించింది. పార్టీ నేతలు, తమిళనాడు ప్రభుత్వ వైఫల్యాలపై ఆరోపణలు చేస్తూ వీడియో ఆధారాలను దర్యాప్తు అధికారులకు సమర్పించారు. విజయ్ ఉపయోగించిన ప్రచార వాహనాన్ని సీబీఐ పరిశీలించగా, ఆ వాహనం డ్రైవర్‌ను కూడా విచారించారు. భారీ రాజకీయ సభలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. డిసెంబర్‌లో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించిన నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, టీవీకే ఆ కౌంటర్‌లో వాస్తవాలు లేవని, సీబీఐ అధికార పరిధిని తొలగించేందుకు సరైన కారణాలు చూపలేదని వాదించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు తప్పుడు, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ఆరోపించింది. ఇలాంటి ప్రకటనలు కొనసాగుతున్న దర్యాప్తుకు, సుప్రీంకోర్టు పర్యవేక్షణకు ఆటంకం కలిగిస్తాయని పార్టీ పేర్కొంది.
