
సీబీఎస్ఈ పాఠశాలల కోసం డేటా ఆధారిత రిపోర్ట్ కార్డు
దేశంలోని అనుబంధ పాఠశాలల విద్యా ప్రమాణాలను సమగ్రంగా అంచనా వేసేందుకు కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్ఈ) 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠశాల విద్యా ఫలిత పత్రికను విడుదల చేసింది. విద్యా రంగంలో డేటా ఆధారిత ప్రణాళికా రూపకల్పనకు ఇది ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ పద్ధతిని సీబీఎస్ఈ తొలిసారిగా అమల్లోకి తీసుకురావడం విశేషం. పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను రాష్ట్ర, జాతీయ సగటు ఫలితాలతో పోల్చి ప్రతి పాఠశాల పనితీరును వివరంగా ఇందులో ప్రతిబింబించారు.
సీబీఎస్ఈ కార్యదర్శి హిమాంశు గుప్తా మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా పాఠశాలలు “తమ బలాలు, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలను స్పష్టంగా గుర్తించుకోగలవు అని పేర్కొన్నారు. అదేవిధంగా అబ్బాయిలు–అమ్మాయిల విద్యా ధోరణులను విశ్లేషించడం ద్వారా లింగ సమానత సాధనకు కూడా ఇది దోహదపడుతుందని వివరించారు.
విద్యా సూచకాలతో పాటు, క్రీడలు, క్రీడా విజయాలకు సంబంధించిన వివరాలను కూడా ఈ పత్రికలో పొందుపరిచారు. పాఠశాల స్థాయిలో సాధించిన ఫలితాలను సముదాయం, ప్రాంత స్థాయిలోని ఫలితాలతో పోల్చి విశ్లేషించడం ఈ పత్రిక ప్రత్యేకత.
అంతేకాక ఈ ఫలిత పత్రిక పాఠశాలలకు ఉపయోగపడే విధంగా రూపొందించబడింది. బోధన, అభ్యాస విధానాల్లో నిరంతర అభివృద్ధి సాధించేందుకు ఇది తోడ్పడుతుందని అన్నారు. సీబీఎస్ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ పత్రికను జాగ్రత్తగా పరిశీలించి అందులోని అంశాలను వార్షిక విద్యా, బోధన ప్రణాళికల్లో చేర్చాలని సూచించింది. దీని ద్వారా బాధ్యతాయుతమైన విద్యా విధానాలు, అదేవిదంగా విద్యావ్యవస్థలో గొప్ప విశిష్టతకు సాధ్యమవుతాయని మండలి విశ్వాసం వ్యక్తం చేసింది.
