
సీబీఎస్‌ఈ పాఠశాలల్లో సైకాలజిస్టుల నియామకం తప్పనిసరి
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం, వారికి సరైన కెరీర్ మార్గనిర్దేశం అందించడమే లక్ష్యంగా కేంద్ర విద్యా మండలి (సీబీఎస్ఈ) కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. సీబీఎస్‌ఈకు అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలల్లో సామాజిక-భావోద్వేగ (సోషియో-ఎమోషనల్) కౌన్సిలర్లు, కెరీర్ కౌన్సిలర్ల నియామకం ఇకపై తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ అఫిలియేషన్ బై-లాజ్, 2018లోని క్లాజ్ 2.4.12ను సవరించింది. రాజస్థాన్ హైకోర్టులో 2025 జూలైలో కోటాకు చెందిన న్యాయవాది సుజీత్ స్వామి, కొంతమంది మానసిక నిపుణులతో కలిసి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్) నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
పీఐఎల్‌లో ఏముందంటే…
పీఐఎల్‌లో విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, చదువు భారం, సరైన కెరీర్ మార్గనిర్దేశం లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. పాఠశాలల్లో అర్హత కలిగిన కౌన్సిలర్లను తప్పనిసరిగా నియమించడం, ఒక సమగ్ర మానసిక ఆరోగ్య సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. ఈ కేసు విచారణ సందర్భంగా 2025 సెప్టెంబర్‌లో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సీబీఎస్‌ఈ, రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఆర్బీఎస్ఈ), యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలు కోరింది. వాటిని పరిశీలించిన అనంతరం సీబీఎస్‌ఈ జనవరి 19, 2026న సర్క్యులర్ జారీ చేస్తూ కీలక సవరణలు చేసింది.
కొత్త నిబంధనలు ఏమిటి?
సవరించిన నిబంధనల ప్రకారం సీబీఎస్‌ఈ రెండు కొత్త ఉపక్లాజ్‌లను చేర్చింది.
క్లాజ్ 2.4.12.1:
ప్రతి సీబీఎస్‌ఈ పాఠశాలలో ప్రతి 500 మంది విద్యార్థులకు ఒక రెగ్యులర్ కౌన్సెలింగ్ అండ్ వెల్‌నెస్ టీచర్ లేదా సామాజిక-భావోద్వేగ కౌన్సిలర్‌ను నియమించాలి.
క్లాజ్ 2.4.12.2:
కెరీర్ కౌన్సిలర్ నియామకం తప్పనిసరి.
ఇంతకుముందు నిబంధనల ప్రకారం 9 నుంచి 12 తరగతుల్లో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో మాత్రమే ఫుల్‌టైమ్ సైకాలజికల్ కౌన్సిలర్ అవసరం ఉండేది. చిన్న పాఠశాలలకు పార్ట్‌టైమ్ కౌన్సిలర్లను అనుమతించేవారు.
అర్హతలు, బాధ్యతలు
కౌన్సెలింగ్, వెల్‌నెస్ టీచర్‌కు అర్హతలు:
• సైకాలజీలో గ్రాడ్యుయేట్ లేదా పీజీ డిగ్రీ
• లేదా మానసిక ఆరోగ్యం/కౌన్సెలింగ్‌లో ప్రత్యేకతతో సోషల్ వర్క్‌లో పీజీ
• సీబీఎస్‌ఈ గుర్తించిన 50 గంటల సామర్థ్యాభివృద్ధి శిక్షణ తప్పనిసరి
వారి బాధ్యతలు
విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్, భావోద్వేగ అభ్యాసం, సంక్షోభ సమయంలో జోక్యం, మానసిక సమస్యల గుర్తింపు, ఉపాధ్యాయులు–తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, గోప్యత పాటించడం. చిన్న పాఠశాలల సౌలభ్యం కోసం ‘హబ్ అండ్ స్పోక్ స్కూల్ మోడల్’ను కూడా సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టింది. ఇందులో పెద్ద పాఠశాలలు (హబ్) సమీపంలోని చిన్న పాఠశాలలకు (స్పోక్) మార్గనిర్దేశం చేస్తాయి.
కెరీర్ కౌన్సిలర్ నిబంధనలు
9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 500 మందికి ఒక కెరీర్ కౌన్సిలర్ ఉండాలి.
కెరీర్ కౌన్సిలర్‌కు హ్యూమానిటీస్, సైన్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్ లేదా టెక్నాలజీ రంగాల్లో గ్రాడ్యుయేట్ లేదా పీజీ డిగ్రీ ఉండాలి.
న్యాయవాదుల స్పందన
పీఐఎల్ దాఖలు చేసిన న్యాయవాది సుజీత్ స్వామి మాట్లాడుతూ, ప్రైమరీ నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు విద్యార్థుల మానసిక ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పిటిషన్ వేశామని తెలిపారు. ముఖ్యంగా 10వ తరగతి తర్వాత కెరీర్ మార్గనిర్దేశం చాలా అవసరమని ఆయన అన్నారు. సీబీఎస్‌ఈ ఈ మార్పులు అమలు చేయడం ఆనందంగా ఉందని, ఇలాంటి సంస్కరణలు ఆర్‌బీఎస్‌ఈ పాఠశాలల్లో కూడా రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాజస్థాన్ హైకోర్టు న్యాయవాది అమిత్ దాధిచ్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా మానసిక ఆరోగ్య సహాయక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా సానుకూల ఫలితాలు త్వరలోనే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
