Let's talk: editor@tmv.in
సీబీఎస్ఈలో త్రిభాషా విధానం

సీబీఎస్ఈలో త్రిభాషా విధానం

Shaik Mohammad Shaffee
4 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ పాఠశాలల పాఠ్యప్రణాళికలో కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020), జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం (ఎన్‌సీఎఫ్) సిఫార్సుల మేరకు రూపొందించిన కొత్త కరికులాన్ని 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు ప్రకటించారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, వారిలో విభిన్న భాషల పట్ల అవగాహన, సబ్జెక్టులపై లోతైన నైపుణ్యాన్ని పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

నిర్బంధంగా రెండు భారతీయ భాషలు

కొత్త విధానం ప్రకారం 6వ తరగతి నుంచి విద్యార్థులకు 'త్రిభాషా సూత్రం' అమల్లోకి రానుంది. ఈ విధానంలో విద్యార్థులు చదివే మూడు భాషల్లో కనీసం రెండు భాషలు తప్పనిసరిగా భారతీయ మూలాలు ఉన్నవి అయి ఉండాలి. బహుభాషలపై విద్యార్థులకు పట్టు సాధించేలా ఈ పద్ధతిని ఆర్1, ఆర్2, ఆర్3 అనే మూడు దశలుగా విభజించారు. విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు కొన్ని నిబంధనల మేరకు మినహాయింపులు ఉన్నప్పటికీ, వారు చదవాల్సిన మొత్తం సబ్జెక్టుల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

మ్యాథ్స్, సైన్స్‌లో రెండు స్థాయిల పరీక్షలు

తొమ్మిదో తరగతి నుంచి గణితం, సైన్స్ సబ్జెక్టుల బోధనలో బోర్డు 'రెండు స్థాయిల' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా స్థాయిని ఎంచుకోవచ్చు. ఇది అందరు విద్యార్థులకు తప్పనిసరి. 80 మార్కులకు, 3 గంటల పాటు సాధారణ పరీక్ష జరుగుతుంది. సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి, లోతైన అవగాహన ఉన్న విద్యార్థులు అదనంగా ఈ స్థాయిని ఎంచుకోవచ్చు. ఇది 25 మార్కుల ప్రత్యేక పరీక్ష, గంట కాలపరిమితి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అడ్వాన్స్‌డ్ మార్కులను మొత్తం స్కోరులో కలపరు. కానీ, ఇందులో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే విద్యార్థి మార్కు షీట్‌లో 'అడ్వాన్స్‌డ్ క్వాలిఫికేషన్' అని ప్రత్యేకంగా గుర్తిస్తారు.

2028లో నూతన పద్ధతిలో బోర్డు పరీక్షలు

ఈ సంస్కరణలు 2026-27లో 9వ తరగతిలో చేరే విద్యార్థులతో ప్రారంభమవుతాయి. ఈ బ్యాచ్ విద్యార్థులే 2028లో మొదటిసారిగా కొత్త పద్ధతిలో 10వ తరగతి బోర్డు పరీక్షలు రాస్తారు. పాత పద్ధతిలో కేవలం రెండు భాషలు, అందరికీ ఒకే స్థాయి పరీక్షలు ఉండగా.. కొత్త విధానం విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో మరింత వెసులుబాటును, విదేశీ పోటీని తట్టుకునేలా లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.