Let's talk: editor@tmv.in
సీపీఆర్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం

సీపీఆర్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం

Pinjari Chand
14 అక్టోబర్, 2025

భారత ప్రభుత్వం ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ అవగాహనా వారోత్సవాలను సోమవారం నుంచి ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 13 నుంచి 17 వరకు జరగబోయే ఈ వారోత్సవాల్లో దేశంలోని ప్రతి పౌరుడికి సీపీఆర్ ప్రాముఖ్యతను తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య రంగం నుంచి, పౌర సమాజం నుంచి వచ్చిన సుమారు 15 వేల మందికి పైగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుణ్య సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ కార్డియాక్ అరెస్ట్ సమయంలో కేవలం చేతులతో చేసే సీపీఆర్ వలన రక్తప్రసరణను కొనసాగించి, అవయవాలకు ఆక్సిజన్ అందించవచ్చన్నారు. ఇది రోగికి వైద్య సహాయం అందే వరకు ప్రాణాలను కాపాడే అవకాశాలను పెంచుతుందని తెలిపారు. ప్రతి ఇల్లు, పాఠశాల,కార్యాలయం,ప్రజాస్థలంలో కనీసం ఒకరైనా సీపీఆర్ నేర్చుకోవాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. డాక్టర్లు, పారామెడికల్, నర్సులే కావాల్సిన అవసరం లేదు. అందరూ సీపీఆర్ ను నేర్చుకోవాలని కోరారు. ఆమె ఈ సందర్భంగా దేశంలో ఆకస్మిక మరణాలు ప్రధానంగా గుండెపోటు వల్లే సంభవిస్తున్నాయన్నారు. ఈ ఘటనలు 70 శాతం ఆస్పత్రి వెలుపలే సంభవిస్తున్నాయని, అలాంటి సమయాల్లో సమీపంలో ఉన్నవారు సీపీఆర్ చేయగలిగితే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా , లేక ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా 112 ఎమర్జెన్సీ నంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. అత్యవసరం సయమంలో దేశంలో ఎక్కడున్నా సేవలందిస్తామని ఈ సందర్భంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సీపీఆర్ అవగాహన పెంపుదలకై ప్రతిజ్ఞ చేశారు. అలాగే వైద్య నిపుణులు “హ్యాండ్స్ ఓన్లీ సీపీఆర్” పద్ధతిపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. సీపీఆర్ అవగాహనా వారంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞా కార్యక్రమాలు, ప్రత్యక్ష, ఆన్‌లైన్ ప్రదర్శనలు, నిపుణుల చర్చలు, ప్యానెల్ చర్చలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అదనంగా, MyGov, MyBharat ప్లాట్‌ఫారమ్‌లతో కలిసి ఆన్‌లైన్ ప్రతిజ్ఞ, సీపీఆర్ క్విజ్‌ను కూడా నిర్వహించనున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది.

సీపీఆర్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం - Tholi Paluku