Let's talk: editor@tmv.in
సీతాఫలం – ఆరోగ్యానికి వరప్రసాదం

సీతాఫలం – ఆరోగ్యానికి వరప్రసాదం

Dantu Vijaya Lakshmi Prasanna
9 అక్టోబర్, 2025

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి పండ్లు ఎంతో అవసరం. పండ్లు ప్రకృతి ప్రసాదించిన సహజ ఆహార సంపద. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, నీరు, తేలికైన చక్కెరలు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ పండ్లు తినడం వలన శరీరానికి శక్తి, చర్మానికి కాంతి, జీర్ణవ్యవస్థకు ఆరోగ్యం లభిస్తాయి. అదేకాకుండా రోగనిరోధక శక్తి పెరిగి, మనసు తాజాగా ఉంటుంది. అందుకే పండ్లు “ప్రకృతిచే ఇచ్చిన మధురమైన ఔషధం”గా పరిగణించబడుతున్నాయి.

పండ్లలో సీతాఫలం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. సీతాఫలం మృదువైన గుజ్జుతో, తీపి రుచితో చిన్నా,పెద్దా అందరికీ ఇష్టమైనది. ఈ ఫలం వర్షాకాలం చివరలో, శరదృతువులో విస్తృతంగా లభిస్తుంది. సీతాఫలంలో సహజ చక్కెరలు, విటమిన్ C, ఐరన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు, చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. అందువలన సీతాఫలం రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలంగా నిలుస్తుంది.మరి ఈ కాలంలో దొరికే ఈ సీజనల్ పండు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం .

సీతాఫలం రుచికి రుచి ,ఆరోగ్యానికి ఆరోగ్యం

మన భారతదేశం వృక్ష సంపదలో ప్రతి పండు ప్రత్యేకమైనది. అందులో సీతాఫలం (Custard Apple) ఒక అద్భుతమైన తీపి పండు. దీని పేరు వినగానే నోట్లో తీపి రుచి కలుగుతుంది. బయటకు పచ్చటి పొట్టు, లోపల తెల్లని పాలలాంటి గుజ్జుతో ఉండే ఈ పండు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. సీతాఫలాన్ని కొంతమంది “శరీఫా”, “సుగర్ ఆపిల్”, “సిత్తాఫలం” అని కూడా పిలుస్తారు.

• సీతాఫలం ప్రధానంగా వర్షాకాలం తర్వాత పండుతుంది. ఆగస్టు నుండి నవంబర్ వరకు విరివిగా దొరుకుతుంది..

• ఇది పొడి వాతావరణంలో బాగా పండుతుంది. వర్షం తర్వాత మట్టి తేమతో ఈ చెట్లు పుష్కలంగా పండ్లను ఇస్తాయి.

• ఈ కాలంలో మార్కెట్లలో సీతాఫలాలు విరివిగా కనిపిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో ఇవి అధికంగా పండుతాయి.

సీతాఫలంలో పోషక విలువలు

• సీతాఫలం తీపిగా ఉండేంతగా పోషకంగా కూడా ఉంటుంది.

• ప్రతీ 100 గ్రాముల సీతాఫలం గుజ్జులో ఈ క్రింది పోషకాలు ఉంటాయి:

• పోషక పరిమాణం కేలరీలలో - 95 kcal ,కార్బోహైడ్రేట్లు -23.6 g, ప్రోటీన్- 2.1 g, కొవ్వు - 0.4 , ఫైబర్- 4.4 g విటమిన్ C 35- 40 mg , విటమిన్ B6 - 0.2 mg, పొటాషియం - 250 mg, మాగ్నీషియం - 20 mg , ఐరన్ -0.7 mg ఇందులో ఉన్న సహజ విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు

మెదడు ఆరోగ్యానికి మేలు: సీతాఫలంలో ఉన్న విటమిన్ B6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మనసుకు శాంతి కలిగించి, ఒత్తిడిని తగ్గిస్తుంది. విద్యార్థులు మరియు ఉద్యోగులు ఈ పండు తరచుగా తింటే మెదడు చురుకుగా ఉంటుంది.

హృదయాన్ని కాపాడుతుంది : సీతాఫలంలోని పొటాషియం మరియు మాగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి. ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చెడుకొవ్వు (LDL)ను తగ్గించి, హృదయ సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతాయి.

జీర్ణక్రియకు సహాయం : సీతాఫలం సహజమైన ఫైబర్ పండు. ఇది మలబద్ధకం లేకుండా జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది కాబట్టి అధికంగా తినకూడదు.

చర్మం, జుట్టుకు మేలు : విటమిన్ C చర్మాన్ని మెరిసేలా, యవ్వనంగా ఉంచుతుంది. ఇది కోలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం అందాన్ని కాపాడుతుంది. జుట్టు బలంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది.

గర్భిణీలకు ఉపయోగకరం: సీతాఫలంలో ఉన్న ఫోలేట్ (Vitamin B9) గర్భంలో శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. సహజ చక్కెర గర్భిణీ స్త్రీలకు తక్షణ శక్తిని అందిస్తుంది.

రక్షక శక్తిని పెంచుతుంది : విటమిన్ C అధికంగా ఉండటం వలన ఇది (ఇమ్యూనిటీని) వ్యాది నిరోధక శక్తిని పెంచి, జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న వ్యాధుల నుండి రక్షిస్తుంది.ఇటీవల ఈ ఫలాన్ని వివిధ వంటకాల్లో వాడుతునారు. అంటే ఈ సీతాఫల రుచిని అన్నీ కాలాల్లో ఆస్వాదించవచ్చు అన్నమాట.

సీతాఫలం వంటకాల్లో వినియోగం:

సీతాఫలంలోని తీపి రుచి మరియు క్రీము, గుజ్జు కారణంగా ఇది పలు తీపి వంటకాల్లో వాడబడుతుంది.

సీతాఫలం ఐస్క్రీమ్: సీతాఫల గుజ్జును పాలు, క్రీమ్, చక్కెర, వెనిల్లాతో కలిపి చల్లబరచి పిల్లలకు ఇష్టమైన ఐస్క్రీమ్ గా తయారు చేస్తారు. ఈ ఐస్క్రీమ్ సహజమైన రుచితో ప్రత్యేకంగా ఉంటుంది.

సీతాఫలం మిల్క్ షేక్ / స్మూతీ: సీతాఫల గుజ్జును పాలు, ఐస్తో బ్లెండ్ చేస్తే రుచికరమైన మిల్క్షేక్ అవుతుంది. ఇది శక్తినిచ్చే పానీయం.పిల్లలు పెద్ధలు ఈ పానియాన్నిఇష్టంగా ఆస్వాదిస్తారు.

సీతాఫలం బసుందీ / రబ్డీ: పాలు మరిగించి చిక్కగా అయ్యిన తర్వాత చల్లార్చి సీతాఫల గుజ్జు కలపడం ద్వారా ఈ కాలంలో వచ్చే పండుగలలో చేసుకునే ఓ మంచి రుచికరమైన వంటకం అవుతుంది.

కేకులు, పేస్ట్రీలు: సీతాఫల గుజ్జును కేక్ లలో, పేస్ట్రీలలో వాడటం ద్వారా కొత్త రుచులు సృష్టిస్తున్నారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినడం ద్వారా సీతా ఫలం రుచిని వీటి ద్వారా ఆస్వాదిస్తారు.

యోగర్ట్ / ఫ్రోజన్ డిజర్ట్స్: సీతాఫల గుజ్జును పెరుగు లేదా గ్రీక్ యోగర్ట్ లో కలిపి చల్లగా తింటే తేలికైన ఆరోగ్యకరమైన రుచి గల ఆహార పదార్థo అవుతుంది. ఇన్ని రకాలుగా సీతాఫలాన్ని ఈ సీజన్ లో ఆస్వాదిస్తూ అన్ని రకాల వంటకాల్లో దీన్ని కలిపి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఆహారప్రియులు మంచి అనుభూతిని ఆరోగ్యాన్ని పొందుతున్నారు.కానీ దీనిలో కూడా కొన్ని హానిచేసే గుణాలు ఉన్నాయి.

జాగ్రత్తలు: సీతాఫల గింజలు తినరాదు అవి విషపూరితమైనవి.ఈ ఫలాన్ని పండిన వెంటనే తినాలి.ఎక్కువ రోజులు ఉంచితే ఫెర్మెంటేషన్ అవుతుంది. మధుమేహం ఉన్నవారు మితంగా తినడం మంచిది, ఎందుకంటే ఇందులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి.

ఏది ఏమైనా ఈ సీతాఫలం మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆరోగ్య పండు.

దీనిలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ శరీరానికి శక్తినిస్తాయి, మెదడును చురుకుగా ఉంచుతాయి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. పండ్లలో సహజ తీపి రుచిని, ఆరోగ్యాన్ని కలగలిపిన పండు కాబట్టి సీతఫలం తినడం నోటికి రుచి, శరీర ఆరోగ్యానికి రక్షణ.

సీతాఫలం – ఆరోగ్యానికి వరప్రసాదం - Tholi Paluku