
సీతమ్మసాగర్‌కు త్వరలో పర్యావరణ అనుమతులే లక్ష్యం: మంత్రి తుమ్మల
రాష్ట్రానికి అత్యంత కీలకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న ప్రామాణిక కార్యాచరణ విధానానికి (ఎస్‌వోపీ) సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో 2023 మార్చి నుంచి సీతమ్మసాగర్ పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. న్యాయపరమైన చిక్కులు త్వరగా పరిష్కారమై పర్యావరణ అనుమతులు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కృషి చేస్తోందన్నారు. కేంద్ర మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం పెంచి ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసే ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు.
సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు సాంకేతిక అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. పంప్‌హౌస్-1, పంప్‌హౌస్-2 మధ్య దోమలవాగుపై ప్రస్తుతం ఉన్న 0.20 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.50 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనను మంత్రి తుమ్మల ప్రస్తావించారు. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఎత్తిపోతల పథకం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. ఈ ప్రతిపాదనకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
అదేవిధంగా సీతారామ ప్రధాన కాలువపై పంప్‌హౌస్-1, 2, 3 మధ్య అవసరమైన ప్రాంతాల్లో ఎస్కేప్ రెగ్యులేటర్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. వర్షాకాలంలో అధిక వరద ప్రవాహాన్ని నియంత్రించి కాలువలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీటి ఏర్పాటు ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. సత్తుపల్లి ట్రంక్ కాలువలోని యాతలకుంట సొరంగం తవ్వకం పూర్తై ప్రస్తుతం లైనింగ్ పనులు వేగంగా సాగుతున్నాయని తుమ్మల తెలిపారు. 2026 ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసి నీటి విడుదలకు సిద్ధం చేస్తామని చెప్పారు. సొరంగ నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులు త్వరితగతిన విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పరిహారం పెండింగ్ చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని తుమ్మల కోరగా, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో సంప్రదాయ కాలువలకు బదులుగా పైపుల ద్వారా సాగునీటి పంపిణీ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
జూలూరుపాడు సొరంగం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి పాలేరు జలాశయానికి త్వరగా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి సాగునీటి ప్రయోజనాలు త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇరువురు మంత్రులు స్పష్టం చేశారు.
