
సీడ్ యాక్సెస్ రోడ్డుపై 6 లైన్లతో ఎలివేటెడ్ కారిడార్
అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-3)ని జాతీయ రహదారి వరకూ విస్తరించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎడిసిఎల్) కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకూ నిర్మించిన ఈ రహదారిని అక్కడ నుండి మణిపాల్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిలో కలపనున్నారు. 45వ ప్యాకేజీలో భాగంగా రెండోదశలో సీతానగరం నుండి మణిపాల్ ఆస్పత్రి వరకూ సుమారు రూ.613.30 కోట్లతో దీనిలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జ్లు అండర్పాస్లు నిర్మించనున్నారు.
2024 చివర్లో ప్రభుత్వం ఈ అంచనాలు రూపొందించింది. అయితే ప్రాజెక్టులో స్వల్ప మార్పులతో గతంలో ఉన్న అంచనాలు సవరించేందుకు ప్రభుత్వం శుక్రవారం జిఓ ఆర్టి 1089 విడుదల చేసింది. ఎపిసిఆర్డిఎ అదనపు కమిషనర్ ఛైర్మన్ గా, ఎడిసిఎల్ చీఫ్ ఇంజినీరు మెంబర్ కన్వీనర్ గానూ వ్యవహరించే ఈ కమిటీలో ఆర్అండ్ బి, పబ్లిక్ హెల్త్, ఎపిసిఆర్డిఎ ఈ ఎన్సీ లు, గుంటూరు ఆర్టిఒ సభ్యులుగా ఉంటారు. రెండోదశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులకు గతంలో నిర్ణయించిన ధరలు సరిపోవని వాటిని సవరించాలని నిర్ణయించి వెంటనే కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
ఈ రోడ్డును సీతానగరం నుండి ఎన్టీఆర్ కట్ట వరకూ ఆధునిక పద్ధతుల్లో వైర్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ రూపంలోనూ, మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారికి అండర్పాస్ నిర్మించి జాతీయ రహదారిలో ఇంటర్ఛేంజ్ పద్ధతిలో నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్లానులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
రూ.60 కోట్ల ఖర్చు పెరిగే అవకాశం
సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-3)ను 21 కిలోమీటర్ల దూరం నిర్మించనున్నారు. దీనికి మొదటిదశను ఎ, బి లుగా విభజించారు. దొండపాడు నుండి వెంకటపాలెం వరకూ 1ఏ లో రూ.532.14 కోట్లు, 1బిలో వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకూ రూ.303 కోట్లు ఖర్చవుతాయని లెక్కగట్టారు. ప్రస్తుతం 1బి పనులు జరుగుతున్నాయి. రెండోదశలో సీతానగరం వర్కుషాప్ నుండి మణిపాల్ ఆస్పత్రి దగ్గర ఎన్ హెచ్ -16 వరకూ నిర్మిస్తారు. దీనికి రూ.613.30 కోట్లతో గతంలో ప్రత్తిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించిన అంచనాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. సుమారు మరో రూ.60 కోట్ల వరకూ ఖర్చు పెరగనున్నట్లు తెలిసింది. జాతీయ రహదారి వద్ద ఇంటర్చేంజ్ (ట్రంపెట్సెక్షన్)తో కలిపి సుమారు మూడు కిలోమీటర్లు దూరం నిర్మించనున్నారు.
