Let's talk: editor@tmv.in
సీట్ల విషయంలో ఎన్డీయేతో చర్చిస్తున్నాం

సీట్ల విషయంలో ఎన్డీయేతో చర్చిస్తున్నాం

Pinjari Chand
10 అక్టోబర్, 2025

బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో వేగంగా సీట్ల పంపకాల విషయంపై జోరుగా సమావేశాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ,ఆర్వీ) చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కూటమి నాయకులతో చర్చలు మొదలయ్యాయని తెలిపారు. రెండు దశల్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి సమాలోచనలు జరుగుతున్నాయి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చర్చలు నడుస్తున్నాయి. నాకు మంత్రిత్వ బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆ పనుల కోసం వెళ్తున్నాను” అని చెప్పారు. ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఎల్‌జేపీ (ఆర్వీ) పాట్నా కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు కూడా చర్చించే వీలువుంది.

ఈ సందర్బంగా ఎల్జేపీ జాముయి ఎంపీ అరుణ్‌ భారతి మాట్లాడుతూ, “ఎన్నికల దృష్ట్యా మా పార్టీ విధానాలు, వ్యూహాలు ఎలా ఉండాలి? అనే అంశంపై ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తున్నాం. అందుకు పార్టీ ముఖ్యులతో కలిసి నిర్ణయం తీసుకోనున్నాం” అని వివరించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాల గురించి రేపు మీడియా ముఖంగా వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశం మాకు అత్యంత కీలకమైనది అని అన్నారు.

ఆ స్థానాల్లోనే అసెంబ్లీ సీట్లు అడుగుతారా ?

2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ఎల్జేపీ 5 స్థానాల్లో గెలిచింది. అయితే ఈసారి అసెంబ్లీలో దాదాపు 40‌‌–45 స్థానాలు కావాలని బీజేపీ, జేడీయూపై చిరాగ్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. గెలిచిన వైశాలి, హాజిపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను డిమాండ్ చేస్తారా? లేక రాష్ట్రంలోని ఇతర స్థానాల్లో కూడా బలపడాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక బలం ఉన్న చోట కూడా పోటీ చేస్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

బీజేపీ, జేడీయూ ఆధ్వర్యంలోని ఎన్డీయే ఈసారి తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాఘట్బంధన్‌ను ఎదుర్కోనుంది. ఈ బ్లాక్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ (ఎంఎల్), సీపీఐ, సీపీఎంతో పాటు ముకేష్‌ సహాని నేతృత్వంలోని వికాశీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) కూడా ఉన్నాయి. అలాగే జెఎంఎం కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించిన ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని జన సురాజ్‌ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.

సీట్ల విషయంలో ఎన్డీయేతో చర్చిస్తున్నాం - Tholi Paluku