
సీజ్ చేసిన బాణాసంచా పేలి ఎస్సై సహా నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలు
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న బాణసంచా నిల్వలు ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక ఎస్సై కూడా ఉండటం గమనార్హం
పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్‌లో భద్రపరిచారు. వీటిని కోర్టులో సాక్ష్యంగా సమర్పించాల్సి ఉండటంతో మంగళవారం ఉదయం కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా వాటిని బయటకు తీశారు. కోర్టుకు తీసుకెళ్లే ముందు వాటిని ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బాణసంచా ఒక్కసారిగా పేలిపోయింది.
ఈ ఘటనలో కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా తీవ్రంగా గాయపడగా సబ్-ఇన్‌స్పెక్టర్ దుర్గాంజనేయులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హెడ్ కానిస్టేబుల్ తేజా డ్రైవర్ నాగరాజు కూడా గాయపడ్డారు. వెంటనే సహచర సిబ్బంది స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం, అబ్దుల్లా పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
