
సీజేఐ గవాయిపై డీప్ ఫేక్ వీడియో
దేశ సర్వోన్నత న్యాయస్థానం పట్ల కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కోర్టు గదిలో ప్రధాన న్యాయమూర్తిపైకి బూటు విసిరే ప్రయత్నం జరగగా, తాజాగా మరో ఘటనలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భూషణ్ గవాయిని లక్ష్యంగా చేసుకుని కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.
సాంకేతికతతో రాజ్యాంగ పదవిని కించపరిచే యత్నం
నవీ ముంబై, పన్వేల్‌కు చెందిన నిందితుడు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన టూల్స్ ద్వారా తప్పుడు వీడియోను తయారుచేసి దానిని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా వ్యాప్తి చేశాడు. సీజేఐ గవాయిని కించపరిచేలా ఉన్న ఈ కంటెంట్‌పై ఒక స్థానిక పౌరుడు ఫిర్యాదు చేయడంతో పన్వేల్ పోలీసులు వెంటనే స్పందించారు.
యువకుడి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూనే వీడియోకు సంబంధించిన డిజిటల్ మూలాన్ని గుర్తించడానికి సైబర్ నిపుణులను దర్యాప్తులో భాగస్వాములను చేశారు. మరోవైపు అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
వరుస సంఘటనలు
కోర్టు గదిలో దాడి: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే రాకేష్ అనే లాయర్ సీజేఐపైకి బూటు విసిరేందుకు ప్రయత్నించడం కోర్టు ధిక్కారానికి పరాకాష్టగా నిలిచింది. దీనిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించి ఆ న్యాయవాది లైసెన్స్‌ను రద్దు చేసింది.
సోషల్ మీడియాలో ద్వేషం: మరో ఘటనలో సీజేఐని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కులం ఆధారిత, ద్వేషపూరిత పోస్టులు పెద్ద సంఖ్యలో వైరల్ చేశారు. దీనిపై పంజాబ్ పోలీసులు వందలాది ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు.
సాంకేతికత దుర్వినియోగం: తాజాగా డీప్‌ఫేక్ వీడియో సృష్టించి ఇప్పుడు కలకలం రేపుతున్నారు. ఈ డీప్‌ఫేక్‌ల వలన న్యాయస్థానం పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.
సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలపై దాడికి పాల్పడడం ఆధునిక ప్రజాస్వామ్యంలో పెద్ద సవాలుగా మారింది. ఇటువంటి దాడుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సైబర్ భద్రతను, అదేవిదంగా కోర్టుల భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే న్యాయమూర్తులపై భౌతిక, డిజిటల్ దాడులు పెరగడం రాజ్యాంగ విలువలకు , న్యాయ వ్యవస్థ సమగ్రతకు పెనుముప్పుగా పరిణమించింది.
