Let's talk: editor@tmv.in
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు

సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు

Shaik Mohammad Shaffee
28 సెప్టెంబర్, 2025

దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), హైదరాబాద్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎం.ఈ) రెండేళ్ల కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులకు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 14వ తేదీ హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉన్న సీఐటీడీకి వెళ్ళవలసి ఉంటుంది.

సీఐటీడీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధంతో ఎంఈ టూల్‌ డిజైన్ (ఎంఈటీడీ), ఎంఈ టూల్‌ డిజైన్‌ మెకట్రానిక్స్ (ఎంఈఎం) కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. అభ్యర్థులు బీటెక్‌/బీఈ లేదా దానికి సమానమైన డిగ్రీని సంబంధిత విభాగాల్లో (మెకానికల్, ప్రొడక్షన్, మెకాట్రానిక్స్, ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ, ఆటో మొబైల్, ఏరోనాటికల్) కనీసం 50 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 45 ఏళ్లకు మించకూడదు.

అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, అడ్మిషన్ ఫీజును వెంట తీసుకెళ్లాలి. సీటు కేటాయించబడిన అభ్యర్థులు అదేరోజు తప్పనిసరిగా పూర్తి ప్రవేశ రుసుము చెల్లించవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో లేదా ఇన్‌స్టిట్యూట్ సూచించిన ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది.

టూల్ డిజైన్&తయారీ అనేది ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉన్న రంగం. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఆటోమొబైల్, ఏరోస్పేస్, కన్స్యూమర్ గూడ్స్, మెడికల్ పరికరాల తయారీ వంటి పరిశ్రమల్లో అద్భుతమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సీఐటీడీ అధికారిక వెబ్‌సైట్ www.citdindia.orgను సందర్శించండి.

సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు - Tholi Paluku