
సీఐఐ సదస్సు ద్వారా రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు పెట్టుబడులు కీలక ఒప్పందాలతో విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి అదనంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో గత 18 నెలల్లో రాష్ట్రంలో సాధించిన మొత్తం పెట్టుబడుల విలువ రూ. 22 లక్షల కోట్లకు చేరింది అనే సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఈ సదస్సులో 60 దేశాలకు చెందిన ప్రతినిధులు, 30కి పైగా మంత్రులు హాజరయ్యారు. దావోస్ తరహాలో 67 సెషన్లు, 700కు పైగా సమావేశాలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు భరోసాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో ఖాతాను ప్రభుత్వ హామీతో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలసీలు, ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
శ్రీసిటీ విస్తరణ, రాయలసీమలో రేమాండ్స్ ప్రాజెక్టులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీసిటీని అభివృద్ధికి మోడల్‌గా తీర్చిదిద్దుతామని, త్వరలోనే 6 వేల ఎకరాల అదనపు భూమిని కేటాయించనున్నట్లు ప్రకటించారు. శ్రీసిటీలో ఇప్పటికే డైకెన్, ఇసుజు, క్యాడ్‌బరీ వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దీని విస్తరణ ద్వారా 50 దేశాలకు పైగా కంపెనీలు ఇక్కడికి రావాలని, తద్వారా 1.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. శ్రీసిటీ సమీపంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మాణ ఆలోచన కూడా ఉన్నట్లు వెల్లడించారు.
శ్రీసిటీలో కొత్త ఒప్పందాలు
శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేవిధంగా శ్రీసిటీని అభివృద్ధికి మోడల్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజైన శనివారం నాడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.శ్రీసిటీలోని ఏర్పాటైన 5 కంపెనీలను ప్రారంభించారు. దీంతోపాటే శ్రీసిటీలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...”భారత దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక టౌన్ షిప్ శ్రీసిటి. శ్రీసిటి నుంచే డైకెన్, ఇసుజూ, క్యాడ్బరీ లాంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన పరిశ్రమలు ఈ శ్రీసిటీ పారిశ్రామిక టౌన్ షిప్ కు రావాలి. ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు చెందిన హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ డివైసెస్ కంపెనీలకు రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులిచ్చాం. గడచిన రెండు రోజులుగా రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా గడచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. త్వరలోనే శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తాం. 50 దేశాలకు పైగా కంపెనీలు శ్రీసిటీ నుంచి పనిచేస్తాయి. 1.50 లక్షల మంది ఉద్యోగాలతో శ్రీ సిటీ అభివృద్ధి మోడల్ గా మారుతుంది. శ్రీసిటీ సమీపంలోనే ఎయిర్ స్ట్రిప్ నిర్మించే దిశగా ఆలోచన చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శ్రీ సిటీ తరహా మోడల్స్ మరిన్ని రావాల్సి ఉంది. ఒక సంస్థ తయారు చేసిన ఉత్పత్తులు మరో సంస్థకు ముడిసరుకుగా మారతాయి. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం దేశంలోనే తొలిసారిగా ఏపీ ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తోంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు భారీ ప్రణాళికలు వేస్తున్నాం. 2028 నాటికి శ్రీ సిటినీ ఓ బెస్ట్ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తాం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాయలసీమ ప్రాంతంలో రేమాండ్ గ్రూప్ మొత్తం రూ. 1,201 కోట్ల పెట్టుబడితో మూడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాప్తాడులో సిల్వర్ స్పార్క్ అపారెల్ పార్క్ (రూ. 497 కోట్లు), గుడిపల్లి (కియా సమీపంలో) ఆటో కాంపోనెంట్ ప్లాంట్ (రూ. 441 కోట్లు), టెకులోడు వద్ద ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ (రూ. 262 కోట్లు) ఏర్పాటు చేయనుంది. ఈ మూడు యూనిట్ల ద్వారా 6,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని రేమాండ్ సంస్థ హామీ ఇచ్చింది. రాయలసీమలో కియా కార్ల ఫ్యాక్టరీతో పాటు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా వస్తున్నాయని సీఎం తెలిపారు. మరోవైపు రేమాండ్స్ గ్రూప్ గౌతమ్ మైనీ మాట్లాడుతూ, ఏపీలో పరిశ్రమలకు అనుమతులు వేగంగా వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు బాగున్నాయని ప్రశంసించారు.
ఇంధనం, పర్యాటక రంగంలో ముందడుగు
ఇంధన రంగంలో భద్రతను బలోపేతం చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారా లోకేష్, విశాఖ పట్టణం లో తలపెట్టిన 6 గిగావాట్ల డేటా సెంటర్‌కు నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ అందించడంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇంధన వ్యవస్థల రక్షణకు ఈ కేంద్రం దోహదపడుతుందని పేర్కొన్నారు.
పర్యాటక రంగంలో రికార్డు స్థాయి పెట్టుబడులు
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ రంగంలో రూ. 17,800 కోట్ల భారీ పెట్టుబడులపై 104 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా 88,876 మందికి (ప్రత్యక్షంగా 32,206, పరోక్షంగా 56,670) ఉపాధి లభిస్తుంది. థీమ్ పార్కులు, మెరీనాలు, ఫిల్మ్ సిటీలు, క్రూయిజ్‌లు వంటి అంశాలపై ఈ ఒప్పందాలు దృష్టి సారించాయి. తొలిసారిగా పర్యాటక రంగంలో రూ. 1,860 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ఐడి) ఎంఓయూలపై సంతకాలు చేయడం విశేషం.ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ పర్యాటక గమ్యస్థానంగా నిలబెడతాయని మంత్రి దుర్గేష్ అన్నారు.
