
సీఎస్‌ఆర్ నిధుల్లో 50శాతం రాష్ట్రంలోనే ఖర్చు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులలో కనీసం 50 శాతాన్ని రాష్ట్ర పరిధిలోనే ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం సీఎస్‌ఆర్ వ్యయంలో తెలంగాణ వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.
ఇప్పటి వరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్ఆర్ నిధులను వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాల్సిన అవసరం ఉందని, మన రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలోనే ఎక్కువ సీఎస్ఆర్ ఖర్చు పెట్టేలా చూడాలన్నారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం నుంచి సీఎస్‌ఆర్ నిధుల ప్రవాహం తక్కువగా ఉండటాన్ని గుర్తించిన సీఎం, ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల మధ్య వారధిగా పనిచేసేలా ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పోర్టల్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టదగిన ప్రాజెక్టుల వివరాలను పొందుపరుస్తారు. కార్పొరేట్ కంపెనీలు అమలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక 'సీఎస్‌ఆర్ సెల్'ను ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యే కంపెనీలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నెలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా, రాష్ట్రానికి అత్యధికంగా సీఎస్‌ఆర్ నిధులు అందించే కంపెనీల యాజమాన్యాలను, ప్రతినిధులను ఘనంగా సన్మానించాలని అధికారులను ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల వ్యూహాలపై అధ్యయనం
సీఎస్‌ఆర్ నిధులను భారీగా సమీకరిస్తున్న ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న వ్యూహాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కార్పొరేట్ సంస్థల నుంచి నిధులను రాబట్టేందుకు వినూత్న పద్ధతులను అవలంబించాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో సంపద సృష్టిస్తున్న సంస్థలు, అదే సమాజం యొక్క బాధ్యతను కూడా పంచుకోవాలని, ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో కార్పొరేట్ నిధులు కీలకంగా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
