Let's talk: editor@tmv.in
సీఎం ‘హిల్ట్ పాలసీ’ పేరుతో భారీ

సీఎం ‘హిల్ట్ పాలసీ’ పేరుతో భారీ

Pinjari Chand
28 నవంబర్, 2025

తెలంగాణలో రేవంత్ రెడ్డి ‘హిల్ట్ పాలసీ’ పేరుతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని భారీ కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదట మూసీ భూములు, తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇప్పుడు హైదరాబాద్‌లోని పారిశ్రామిక పార్కుల భూములపై కన్నేశారు. ఒకప్పుడు ఉద్యోగాలు కల్పిస్తామని చవకగా ఇచ్చిన భూములను ఇప్పుడు అతి తక్కువ ధరకు అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు అనుమతులు ఇస్తూ రియల్ దందా నడిపిస్తున్నారని మండిపడ్డారు. 9,300 ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తే దాదాపు రూ.5 లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల ఆస్తి ఐదారుగురి జేబుల్లోకి వెళ్తుంది. ఈ డబ్బుల్లో సగం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లో పడుతోంది. ఎవరి అబ్బ సొత్తు ఇది? ఈ పాలసీని వెంటనే రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇది రాష్ట్ర ప్రజల రూ. 5 లక్షల కోట్ల ఆస్తిని ఐదారుగురు వ్యక్తుల కోసం తాకట్టు పెట్టడమేనని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు ప్రముఖ నాయకులు భారీ ఎత్తున బీఆర్ఎస్‌లో చేరారు. వీరికి కేటీఆర్ స్వయంగా గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేసింది

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేసిందని మరోసారి గుర్తు చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో 24 శాతం ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు 17 శాతానికే పరిమితం చేసి చేతులు దులుపుకుంది. రిజర్వేషన్ల పేరు చెప్పి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బీసీ సోదరులు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా అభివృద్ధిపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

పాలమూరుకు చుక్క నీటినీ ఇవ్వలేదు

పాలమూరు బిడ్డనని గొప్పలు చెప్పుకుంటూ, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకుంటూ… రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా పాలమూరు రైతులకు ఒక్క చుక్క నీటిని కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లా అభివృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఒక్కొటి చొప్పున లెక్క చెప్పారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరున్న పాలమూరు. కేసీఆర్ హయాంలో రివర్స్ మైగ్రేషన్‌కు నిలయమైంది. నర్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు పూర్తి చేసి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. 90 శాతం పూర్తైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులు కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని కేటీఆర్ గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్, క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు, కాంగ్రెస్ వైఫల్యాలపై కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ బలోపేతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జోరు కొనసాగుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.