Let's talk: editor@tmv.in
సీఎం హిమంత వర్సెస్ గౌరవ్ గోగోయ్

సీఎం హిమంత వర్సెస్ గౌరవ్ గోగోయ్

Pinjari Chand
9 ఫిబ్రవరి, 2026

తన భార్య ఎలిజబెత్‌ కొల్బర్న్‌ గోగోయ్‌పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ అసోం ప్రదేశ్‌ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ గౌరవ్‌ గోగోయ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలను అత్యంత అర్థరహితమైనవి, నకిలీవిగా అభివర్ణిస్తూ, సీఎం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను ‘సూపర్‌ ఫ్లాప్‌ షో’గా విమర్శించారు. సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో గోగోయ్‌ స్పందిస్తూ, బీజేపీ అవినీతి, మత రాజకీయాలను బట్టబయలు చేయడానికే కాంగ్రెస్‌ చేపట్టిన ‘సమయ్‌ పరివర్తన్‌ యాత్ర’ను అడ్డుకునే ప్రయత్నంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శతాబ్దంలోనే అత్యంత ఫ్లాప్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను భరించాల్సి వచ్చిన ఢిల్లీ, అసోం జర్నలిస్టుల పట్ల నాకు జాలి కలుగుతోంది. ఇది సీ–గ్రేడ్‌ సినిమా కంటే కూడా దారుణం. రాజకీయ చతురుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని గోగోయ్‌ వ్యాఖ్యానించారు. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు 12 వేల బీఘాల భూమిని ఆక్రమించుకున్న అంశాన్ని తమ యాత్ర వెలుగులోకి తెచ్చిందని కూడా ఆయన ఆరోపించారు.

ఎలిజబెత్‌ కొల్బర్న్‌ గోగోయ్‌కు పాక్ తో సంబంధాలు

ఇదిలా ఉండగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గౌరవ్‌ గోగోయ్‌ భార్య ఎలిజబెత్‌ కొల్బర్న్‌ గోగోయ్‌కు పాకిస్థాన్‌ పౌరుడు, వాతావరణ కార్యకర్త అలీ తౌకీర్‌ షేక్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది తీవ్రమైన జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని పేర్కొంటూ, గోగోయ్‌ దీనిపై తప్పకుండా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఎలిజబెత్‌ 2011 మార్చి 18 నుంచి 2012 మార్చి 17 వరకు పాకిస్థాన్‌లో పనిచేశారని, వివాహానంతరం భారత్‌లో ఉన్నప్పటికీ ‘పాస్‌–త్రూ మెకానిజం’ ద్వారా పాకిస్థాన్‌ నుంచే జీతం పొందారని సీఎం ఆరోపించారు. భారత్‌లోని రాజకీయ పరిణామాలపై నివేదికలు పంపినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. శత్రుదేశం నుంచి జీతం తీసుకుంటూ, భారత్‌ రాజకీయాలపై నివేదికలు సమర్పించడం అత్యంత ఆందోళనకరమైన విషయమని వ్యాఖ్యానించారు. అలాగే, ఎలిజబెత్‌ భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు తొమ్మిది సార్లు వెళ్లారని, ఆ పర్యటనల్లో కొన్ని సార్లు గౌరవ్‌ గోగోయ్‌ కూడా ఆమెతో పాటు వెళ్లారని సీఎం తెలిపారు. పాకిస్థాన్‌ హోంశాఖ అభ్యర్థనపై గోగోయ్‌కు వీసా మంజూరై, ఆయన అక్కడ 10 రోజులు గడిపారని పేర్కొన్నారు. ఒక భారత ఎంపీని పాకిస్థాన్‌ హోంశాఖ ఎలా ఆహ్వానించిందన్నదానిపై ప్రశ్నలు లేవనెత్తారు.

గోగోయ్‌ తన పిల్లల భారత పాస్‌పోర్టులను అప్పగించి, వారికి బ్రిటిష్‌ పాస్‌పోర్టులు పొందేందుకు సహకరించారని, ఆయన భార్య ఇప్పటికే బ్రిటిష్‌ పౌరసత్వం కలిగి ఉన్నారని సీఎం శర్మ తెలిపారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ వివాదం గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైనట్లు ఆయన వెల్లడించారు.