Let's talk: editor@tmv.in
సీఎం హిమంత మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు: కాంగ్రెస్

సీఎం హిమంత మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు: కాంగ్రెస్

Pinjari Chand
10 ఫిబ్రవరి, 2026

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్‌పై పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయంటూ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి తన మానసిక సమతుల్యత(మెంటల్ బ్యాలెన్స్) ను కోల్పోయినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. కాంగ్రెస్‌కు చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు గౌరవ్ గోగోయ్‌కు మద్దతుగా నిలిచి, సీఎం తన పదవికి ఉన్న గౌరవాన్ని తానే దిగజార్చుకున్నారని ఆరోపించారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేని పరిస్థితి ఉందంటే, ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నది స్పష్టమవుతోందని వారు పేర్కొన్నారు.

ఇంతకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హిమంత శర్మ, గౌరవ్ గోగోయ్‌, ఆయన బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌, పాకిస్తాన్ పౌరుడు అలీ తౌకీర్ షేక్ మధ్య ‘లోతైన సంబంధాలు’ ఉన్నాయని, ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం పొరుగుదేశానికి చేరిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఏఐసీసీ అస్సాం ఇన్‌ఛార్జ్ జితేంద్ర సింగ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సరైన ఆధారాలు లేవు. రాజకీయ విమర్శలు వేరు, కానీ గౌరవనీయమైన కుటుంబంపై వ్యక్తిగతంగా నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత ఖండనీయమైనదన్నారు. అస్సాంలో హిమంత రాజకీయ ఎదుగుదలలో మాజీ సీఎం తరుణ్ గోగోయ్ కీలక పాత్ర పోషించారని కూడా గుర్తు చేశారు. అధికార లాభాల కోసం తరుణ్ గోగోయ్‌ను వదిలేసిన హిమంత, గత ఏడాది నుంచి గోగోయ్ కుటుంబంపై వరుస ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన కుటుంబంపై ఇప్పుడు బురద చల్లడం దురదృష్టకరమని సింగ్ వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 17, 2025న పాకిస్తాన్ పౌరుడు అలీ తౌకీర్ షేక్ సోషల్ మీడియా వ్యాఖ్యలపై విచారణ కోసం అస్సాం పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. అయితే సిట్ నివేదికపై నిర్వహించిన ప్రెస్ మీట్ పూర్తిగా విఫలమైందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా వ్యాఖ్యానించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రిపున్ బోరా మాట్లాడుతూ సిట్‌కు ఈ తరహా విచారణ చేసే అధికారమే లేదు. సిట్ కేవలం 20 శాతం అంశాలకే పరిమితమని సీఎం స్వయంగా అంగీకరించారు. ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయం అయితే, ఆరు నెలల పాటు సీఎం ఎందుకు మౌనం పాటించారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ మీడియా విభాగం అధినేత పవన్ ఖేరా కూడా హిమంత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికలు దగ్గరపడగానే ముస్లింలు, పాకిస్తాన్ అంశాలను లేవనెత్తడం సీఎం రాజకీయ వ్యూహమని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఆయన మానసిక అస్థిరతను సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చివరకు ప్రజల తీర్పుతోనే తేలిపోతాయని అన్నారు. అస్సాం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీరా బోర్తాకూర్, సీఎం నాటకాలతో ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా గౌరవ్ గోగోయ్‌ను ‘దేశ వ్యతిరేక నెట్‌వర్క్‌లో కీలక పాత్రధారి’గా, ఆయన భార్యను పాకిస్తాన్ ‘ఏజెంట్’గా అభివర్ణించిన హిమంత శర్మ, ఈ అంశాన్ని ప్రజల న్యాయస్థానానికే వదిలేస్తున్నట్లు తెలిపారు.