Let's talk: editor@tmv.in
సీఎం స్టాలిన్, త్రిష ఇళ్లకు బాంబు బెదిరింపులు

సీఎం స్టాలిన్, త్రిష ఇళ్లకు బాంబు బెదిరింపులు

FL - SIMHCLM
4 అక్టోబర్, 2025

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో మరో సంచలనమైన సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సినీ నటి త్రిష నివాసాలతోబాటు గవర్నర్ బంగాళా.. బిజెపి రాష్ట్ర కార్యాలయాల్లో బాంబులు పెట్టమని, వాటిని పేల్చేస్తామని అంటూ అజ్ఞాతవ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ వెనువెంటనే అప్రమత్తమై బాంబ్ డిస్పోసల్ బృందాలు, పోలీసు జాగిలాలు సంఘటనా స్థలాలకు చేరుకుని తనిఖీలు చేసాయి. అయితే ఆ ప్రదేశాల్లో ఎక్కడా బాంబులవంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నాయి. అవి ఉత్తుత్తి బెదిరింపులేనని తేల్చారు. అయినప్పటికీ మద్రాసు నగరంలోని అల్వార్‌పేటలోని ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్ చుట్టూ భద్రతా సిబ్బందిని రెట్టింపు చేసారు. నిఘా మరింత పెంచారు.

అయితే ఇలా ఫోన్ కాల్స్ చేసింది ఎవరన్నదానిని కనుగొనేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఇదిలాఉండగా గతంలో సైతం సీఎం స్టాలిన్, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ తరహా లోనే బెదిరింపులు రావడం చూస్తుంటే ఎవరో ఆకతాయిలు కావాలనే ఇలాంటి పనులకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు Z-ప్లస్ భద్రత ఉన్నప్పటికీ.. వరుసగా రెండో సారి కూడా ఇలా కాల్స్ రావడం ప్రభుత్వ వర్గాలను కలవరపరుస్తోంది. కొంతమంది రాష్ట్రంలో ఇలా అలజడి రేపేందుకు ఇలాంటి కాల్స్ చేస్తున్నారేమో అని పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు మొదలు పెట్టారు. వేర్వేరు ఈ-మెయిల్ ఐడీల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. సదరు మెయిల్ ఐడీల వివరాలు, ఐపి అడ్రస్ లను పోలీసులు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా గురువారం అర్ధరాత్రి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాశ్రయంలోని చెత్త డబ్బాల్లో పేలుడు బాంబు దాచిపెట్టినట్లు మేనేజర్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అర్ధరాత్రి అత్యవసర భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సీనియర్ అధికారులు, బీసీఏఎస్ ప్రతినిధులు, సీఐఎస్​ఎఫ్ అధికారులు, ఎయిర్‌లైన్ మేనేజర్లు, విమానాశ్రయ పోలీసులు పాల్గొన్నారు. మొత్తం విమానాశ్రయాన్ని భద్రతాను కట్టుదిట్టం చేసిన విస్తృతమైన తనిఖీలు చేపట్టారు. బాంబు, డాగ్ స్వ్కాడ్ రాత్రంతా సోదాలు నిర్వహించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ప్రయాణికులను కూడా అదనపు తనిఖీలు చేశారు. చెత్త బుట్టలు, విమానాల్లో లోడ్ చేసిన పార్శిల్స్, ప్రయాణికుల లగేజ్‌ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కరూర్​ తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్​కు బాంబు బెదిరింపులు వచ్చాయి. నీలంకరైలోని విజయ్ ఇంటి వద్ద బాంబు అమర్చినట్లు చెన్నై డీపీజీ కార్యలయానికి ఈమెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్వ్కాడ్, స్నిఫర్​ డాగ్​ సాయంతో విజయ్​ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు, అనుమాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గత నెలలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం, డీఎంకే మంత్రి ఇల్లు సహా 10 ప్రాంతాలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నై నందంబాక్కంలో ఉన్న చెన్నై ట్రేడ్ సెంటర్‌కి వీసీకే ఎమ్మెల్యే ఆలూర్ షా నవాజ్ పేరుతో ఈ - మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అందులో ట్రేడ్ సెంటర్‌లో, సమాచార శాఖ మంత్రి పళని వేల్ త్యాగరాజ్ మదురై ఇంట్లో బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. అనంతరం పోలీసులు తనిఖీ చేపట్టి, అదేవిధంగా మదురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లో బాంబు లభించలేదు. అదేవిధంగా చెన్నై కోటలో ఉన్న నేవీ హోటల్, పురసైవాక్కం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, రాయపేటలో ఉన్న అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయం మొదలైన పది ప్రాంతాలకు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయమై నుంగంబాక్కం, ట్రిప్లికేన్, రాయపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఎం స్టాలిన్, త్రిష ఇళ్లకు బాంబు బెదిరింపులు - Tholi Paluku